అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' మరో సంచలనం!
on Oct 29, 2022

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా 'శాటర్న్ అవార్డు'ను సైతం గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్'.. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సాధించింది.
ఓటీటీ ద్వారా పలు దేశాల ప్రేక్షకులకు చేరువైన 'ఆర్ఆర్ఆర్' గురించి ఇప్పటికే హాలీవుడ్ కి చెందిన పలు మ్యాగజైన్లు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. అయితే ప్రపంచంలోనే టాప్ మూవీ మ్యాగజైన్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న 'ఎంపైర్ మ్యాగజైన్'లో తాజాగా 'ఆర్ఆర్ఆర్' గురించి ప్రత్యేక కథనం వచ్చింది. ప్రస్తుతం ఈ కథనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ తెలుగు సినిమా గురించి ఏకంగా టాప్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ప్రత్యేక కథనం రాయడంతో.. నెటిజన్లు 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్స్ కి వెళ్లే అర్హత ఉందని విదేశీ ప్రేక్షకులు, హాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' టీమ్ సైతం ఆస్కార్ నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. మరి వరల్డ్ వైడ్ గా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.. ఆస్కార్ బరిలోనూ నిలిచి అద్భుతం సృష్టిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



