ఇయర్ ఎండింగ్‌లో చేతులెత్తేసిన డబ్బింగ్ సినిమా!
on Dec 28, 2022

ఈ ఏడాది కన్నడ నుంచి వచ్చిన రెండు డబ్బింగ్ చిత్రాలు భారీ విజయాలను నమోదు చేశాయి. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన కేజిఎఫ్ 2 చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా షేర్లను సాధించి ఆశ్చర్యపరిచింది. కేవలం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 60 కోట్లను మించిన లాభాలను రాబట్టింది. ఇక ఆ తరువాత కాంతారా సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు. కన్నడ నేటివిటీ చిత్రమైనప్పటికీ ఈ డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ రేంజ్‌లో కాకపోయినా మొత్తం మీదగా అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లను రాబట్టింది.
తెలుగు వెర్షన్ 65 కోట్లకు పైగా రావడం గమనార్హం. ఇక ఆ తరువాత వచ్చిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర చిత్రం కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. కాబట్టి నాగార్జున వంటి స్టార్ నటించడంతో పాటు అమితాబ్, రణబీర్ కపూర్, అలియాభట్ వంటి వారు నటించడంతో ఈ మూవీ బాగానే వసూళ్లు రాబట్టింది. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన లవ్ టు డే చిత్రం కూడా తన సత్తాను చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్ర, లవ్ టుడే చిత్రాలు అంచనాలను మించి రాణించాయని చెప్పాలి. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి డబ్బింగ్ చిత్రాలు చేతులెత్తేశాయి. డిసెంబర్ ఎండింగ్లో రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. నయనతార హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కనెక్ట్ హర్రర్ థ్రిల్లర్‌గా తెలుగులోకి వచ్చింది.
నయనతార భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. కానీ ఈ సినిమా ఏ మాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు మాస్ యాక్షన్ హీరోగా కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా బాగానే మార్కెట్ ఉన్న విశాల్ నటించిన లాఠీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీసం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది అంటే అది కూడా ఈ చిత్రం చేయలేకపోయింది. ఏ క్లాస్ సెంటర్స్ తో పాటు బీ,సీ సెంటర్లు, మాస్ యాక్షన్ సినిమాల అభిమానులను కూడా ఇది ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. దీంతో ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా మారి ఇయర్ ఎండింగ్ లో డబ్బింగ్ చిత్రాలకు ఒక విషాదంగా మారాయి. ఏడాదంతా నాలుగు చిత్రాలు తమ హవా చూపగా ఎండింగ్లో వచ్చిన రెండు డబ్బింగ్ చిత్రాలు మాత్రం ఉసురుమనిపిచ్చాయి.
మరి వచ్చే ఏడాది అయినా డబ్బింగ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. అందులో ముందుగా సంక్రాంతి కానుకగా కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన దిల్ రాజు మూవీ వారసుడు విడుదల కానుంది. ఆ రోజే అజిత్ నటించిన తెగింపు చిత్రం కూడా డబ్బింగ్ మూవీగా తెలుగులోకి రానుంది. మరి ఈ రెండు చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిల పోటీని తట్టుకొని ఏమాత్రం కలెక్షన్లు వసూలు చేస్తాయో వేచి చూడాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



