'ప్రేమఖైదీ' హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
on Jan 19, 2021
ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో డి. రామానాయుడు నిర్మించిన 'ప్రేమఖైదీ' (1990) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. నాయికగా మాలాశ్రీ నటించిన ఆ సినిమాతో ఓ అందాల హీరో పరిచయమయ్యాడు. అతను.. హరీశ్! అదివరకు బాలనటుడిగా ఇంప్రెస్ చేసిన అతను హీరోగా తొలి సినిమాతోటే తన హ్యాండ్సమ్ లుక్స్‌తో, పర్ఫార్మెన్స్తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మాధవయ్యగారి మనవడు, పెళ్లాం చెబితే వినాలి, కాలేజ్ బుల్లోడు, ఏవండీ ఆవిడ వచ్చింది, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించాడు. 'ప్రేమఖైదీ' హిందీ రీమేక్ 'ప్రేమ్ ఖైదీ'తో బాలీవుడ్‌లోనూ తన ముద్రను వేశాడు హరీశ్. ఆ మూవీలో కరిష్మా కపూర్ హీరోయిన్ కావడం గమనార్హం.
అలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న హరీశ్ హఠాత్తుగా సినిమాల నుంచి మాయమయ్యాడు. 1999లో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా రామోజీ రావు నిర్మించిన 'డాడీ డాడీ' మూవీలో కనిపించాక, చాలా కాలం ఏమైపోయాడో తెలీలేదు. ఆ తర్వాత ఏకంగా ఎనిమిదేళ్ల గ్యాప్‌తో 2007లో అల్లరి నరేశ్, కమలినీ ముఖర్జీ కాంబినేషన్లో 'పెళ్లయింది కానీ' సినిమాలో మరో హీరోగా నటించాడు. అతడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఈవీవీ ఈ సినిమాకి డైరెక్టర్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నమోదైంది. అంతే.. టాలీవుడ్లో మళ్లీ హరీశ్‌ను పట్టించుకున్నవాళ్లు లేరు. బాలీవుడ్లో 2011లో గోవిందాతో కలిసి 'నాటీ ఎట్ 40' చేసిన అతను 2012లో 'చార్ దిన్ కీ చాందిని' అనే మరో సినిమా చేశాడు. తిరిగి ఆరేళ్ల తర్వాత 'ఆ గయా హీరో' (2018)లో మరోసారి గోవిందాతో నటించాడు. అతడు చివరగా నటించిన సినిమా అదే.
యాక్టర్లకు ప్రధానమైంది రూపమే. రూపాన్ని కాపాడుకుంటూ ఉన్నంత కాలం అవకాశాలుంటాయి. లేకపోతే ఫేడవుట్ అయిపోతారు. లుక్స్ విషయంలో శ్రద్ధ చూపించకపోవడం వల్ల హరీశ్ బాగా బరువు పెరిగిపోయాడనీ, అందువల్లే అతనికి అవకాశాలు మృగ్యమయ్యాయనీ ఊహించవచ్చు. ప్రస్తుతం అతని వయసు 45 సంవత్సరాలే. అదే వయసులో ఉన్న పలువురు హీరోలు మంచి ఫిజిక్ మెయిన్టైన్ చేస్తూ హీరోలుగా కొనసాగుతుండగా, బాగా బరువుపెరిగిన హరీశ్ వెనకబడిపోయాడు. 1995లో సంగీతా చుగ్‌తో అతనికి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హరీశ్ ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డాడు.