నాన్నగారు కోలుకుంటున్నారు.. తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. సత్యనారాయణ కుమార్తె!
on Nov 23, 2021

లెజెండరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య స్థితిపై మంగళవారం ఉదయం ఒక్కసారిగా తప్పుడు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన మృతి చెందినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దనీ, తమ తండ్రి కోలుకుంటున్నారనీ సత్యనారాయణ కుమార్తె రమాదేవి విజ్ఞప్తి చేశారు. తమ తండ్రి ఆరోగ్య స్థితి గురించి లేటెస్ట్‌గా ప్రచారంలోకి వచ్చిన రూమర్స్‌ను ఆమె ఖండించారు.
మీడియాకు పంపిన ఒక ఆడియో ఫైల్‌లో ఆమె, "నాన్నగారి పరిస్థితి బాగానే వుంది. ఆయన కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్ మాదాల రవిగారు వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి థమ్సప్ కూడా చూపించారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. దయచేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దు." అని రిక్వెస్ట్ చేశారు.
మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన సత్యనారాయణను కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తూ వస్తున్న వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఆయన స్పృహలోకి వచ్చినట్లు, తాను స్వయంగా ఫోన్‌లో ఆయనను పరామర్శించినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
హాస్పిటల్ వెలువరించిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం సత్యనారాయణ క్రమంగా కోలుకుంటున్నారు. రక్తపోటు అదుపులోకి వస్తోంది. కిడ్నీల పనితీరు మెరుగయ్యింది. ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై కొనసాగుతున్నారు. నెమ్మదిగా వెంటిలేటర్ సపోర్ట్‌ను తగ్గిస్తూ వస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



