విడాకుల కోసం కోర్టుకెక్కిన శ్రీను వైట్ల భార్య రూప
on Jul 18, 2022

డైరెక్టర్ శ్రీను వైట్ల భార్య సంతోష రూప భర్త నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీను, రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని రెండు దశాబ్దాల పాటు కాపురం చేసిన ఆ ఇద్దరూ, ఇప్పుడు విడిపోనున్నారు. రవితేజ హీరోగా నటించిన 'నీకోసం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీను వైట్ల, కెరీర్ మొదట్లోనే రూపతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు.
దర్శకునిగా 'ఆనందం' సినిమాతో మొదటి సూపర్ హిట్‌ను అందుకున్న శ్రీను, ఆ తర్వాత వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్‌షా లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు స్టైలిస్ట్‌గా పనిచేశారు రూప. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆయన వైవాహక జీవితం కూడా ఏడేళ్లుగా చిక్కులను ఎదుర్కొంటూ వస్తోంది. శ్రీను, రూప మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు, 2015లో భర్తపై రూప గృహహింస కేసు పెట్టేదాకా వెళ్లింది.
2015 అక్టోబర్‌లో భర్త వేధిస్తున్నాడంటూ సంతోష రూప బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను ఆయన మానసికంగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు, భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే తర్వాత శ్రీను వైట్ల తల్లితండ్రులు జోక్యం చేసుకొని ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో, ఆమె తన కేసును ఉపసంహరించుకున్నారు.
అయితే ఇప్పుడు శ్రీను వైట్ల ధోరణితో విసిగిపోయిన ఆమె, ఆక ఆయనతో కలిసి ఉండలేనని నిర్ణయించుకొని ఇప్పుడు ఏకంగా విడాకులు కోరుతూ నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



