గోపీచంద్ నుంచి రజనీకాంత్ దాకా.. శివ సూపర్బ్ జర్నీ!
on Aug 27, 2020

గోపీచంద్ హీరోగా నటించిన 'శౌర్యం' సినిమా విడుదలైనప్పుడు దాని డైరెక్టర్ శివను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. స్థూలకాయుడిలా కనిపించిన అతను అప్పటివరకూ సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేశాడు. స్వతహాగా తమిళుడైన అతను మొదట ఒక మలయాళ సినిమాకు, చార్లీ చాప్లిన్ అనే తమిళ సినిమాకూ పనిచేసి, ఆ తర్వాత తెలుగులో శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, గౌతమ్ ఎస్ఎస్‌సి, బాస్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
ఆ టైమ్‌లోనే అతను వినిపించిన కథ గోపీచంద్‌కు నచ్చడంతో అతడి డైరెక్షన్‌లోనే 'శౌర్యం' సినిమా చేశాడు. అలా డైరెక్టర్‌గా తొలి సినిమాతో సక్సెస్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు శివ. 'శౌర్యం' ఇచ్చిన విజయం ఊపుతో అతనితోనే గోపీచంద్ మరో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఫ్లాపయింది. అది.. 'శంఖం'. ఆ తర్వాత రాజమౌళి 'విక్రమార్కుడు' మూవీని కార్తీతో 'సిరుతై'గా రీమేక్ చేశాడు శివ.
తిరిగి టాలీవుడ్‌కు వచ్చి రవితేజతో 'దరువు' రూపొందించాడు. ఆ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోలేకపోయినప్పటికీ, తమిళ టాప్ స్టార్స్‌లో ఒకడైన అజిత్‌ను తన కథతో ఇంప్రెస్ చేశాడు. ఆయన ఓకే అనడంతో 'వీరమ్' మూవీ వచ్చింది. అది సూపర్ హిట్. అది మొదలు.. అజిత్‌తో శివ కాంబినేషన్ కంటిన్యూ అయ్యింది. వరుసగా వేదాళమ్, వివేగమ్, విశ్వాసమ్ సినిమాలు వచ్చి, ఒకదాన్ని మించి ఒకటిగా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. కోలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు శివ.
ఇప్పుడు ఏకంగా సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు శివ. ఆ సినిమా.. 'అన్నాత్తే'. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ మూవీలో రజనీతో పాటు నయనతార, కీర్తి సురేశ్, మీనా, కుష్బూ, ప్రకాశ్‌రాజ్ వంటి ఉద్ధండులు నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ఈ మూవీని శివ రూపొందిస్తున్నాడు. కెమెరామన్ నుంచి డైరెక్టర్‌గా ఎదిగి, ఇవాళ ఏకంగా సూపర్ స్టార్ రజనీనే డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగడం వెనుక టాలెంట్‌తో పాటు పనిపై శివ అంకిత భావం, ప్రేమ ఉన్నాయి. 'అన్నాత్తే' సినిమాతో శివ ఏ స్థాయి సక్సెస్‌ను అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



