మహేశ్ వేరే లెవల్లో కామెడీ చేశారు: అనిల్ రావిపూడి
on Jan 8, 2020

"మహేశ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. 'ఖలేజా'లో ఆయన చేసిన కామెడీ, ఆయన టైమింగ్ ఇన్‌క్రెడిబుల్. అలాగే 'దూకుడు'లోనూ తన కామెడీ టైమింగ్‌తో ఆయన అలరించారు. అందుకే ఆయనతో కామెడీ చేయించడం నాకు రిస్కనిపించలేదు. వేరే స్థాయిలో ఈ సినిమాలో ఆయన కామెడీ పండించారు" అని చెప్పాడు అనిల్ రావిపూడి. 'పటాస్'తో మొదలుకొని 'ఎఫ్2' వరకు వరుసగా నాలుగు హిట్ సినిమాలు తీసి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లీగ్‌లో చేరిన ఆయన డైరెక్ట్ చేసిన ఐదో సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. మహేశ్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో చేసిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...
* పోయిన సంక్రాంతికి నా సినిమా 'ఎఫ్2' చూసి ప్రేక్షకులు ఎంతగా నవ్వుకున్నారో, ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' చూసి అంతకంటే ఎక్కువగా నవ్వుకుంటారు. సినిమా సంక్రాంతి భోజనంలా ఉంటుంది.
* తొలి సినిమా 'పటాస్' నుంచి ఎంతోకొంత నేర్చుకుంటూ వస్తున్నా. మహేశ్ నన్నూ, నా కథనూ నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు 'ఎఫ్2' సినిమా చేస్తున్న సమయంలోనే 2018 ఆగస్టులో ఈ కథను 40 నిమిషాల పాటు చెప్పాను. ఆయనకు నచ్చింది. 2019 ఫిబ్రవరిలో మనం సినిమా చేస్తున్నామని ఆయన చెప్పారు. అప్పుడు కథ మొత్తం రాసుకొని మేలో వినిపించాను. ఆయనకు చాలా నచ్చేసింది. ఆ వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోయాం.
* బౌండెడ్ స్క్రిప్టుతో, మంచి ప్లానింగ్‌తో చేశాం కాబట్టి, నా గత సినిమా వచ్చిన సరిగ్గా ఏడాదికి మళ్లీ ఈ సినిమాతో నేను మీ ముందుకు రాగలుగుతున్నా. ఇది పూర్తిగా సమష్టి కృషి.
* ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కావడం వల్ల రియల్ లొకేషన్స్‌లో ఫిల్మింగ్ చెయ్యాలనే ఉద్దేశంతో కశ్మీర్‌కు వెళ్లి చిత్రీకరణ జరిపాం. సినిమా మొదట్లో 25 నిమిషాల పాటు ఉండే ఆర్మీ బ్యాక్‌డ్రాప్ సీన్లు పేట్రియాటిక్ ఫీల్‌తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.
* ఒక ఆర్మీ మేజర్ సోషల్ లైఫ్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌పై మహేశ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇంతవరకు ఏ సినిమాలోనూ నేను ఈ తరహా క్యారెక్టరైజేషన్ చూడలేదు. జోధ్‌పూర్‌లో 'సుప్రీమ్' సినిమా ఫిల్మింగ్ చేసేటప్పుడు ట్రైన్ జర్నీలో ఓ ఆర్మీ ఉద్యోగితో ఇంటరాక్షన్ సందర్భంగా ఈ కథ ఐడియా స్ఫురించింది. ఆర్మీ మనిషి అయినప్పటికీ ఆయన చాలా సరదాగా మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. మహేశ్ క్యారెక్టర్‌కు అతనే ఇన్‌స్పిరేషన్.
* 'సరిలేరు నీకెవ్వరు' అనేది ప్రధానంగా మూడు క్యారెక్టర్ల మధ్య నడిచే కథ. మేజర్‌గా మహేశ్, మినిష్టర్‌గా ప్రకాశ్‌రాజ్, ప్రొఫెసర్‌గా విజయశాంతి మధ్య ఆ ప్లే ఉంటుంది. సాధారణంగా శత్రువుతో యుద్ధం చెయ్యమని అన్ని కథలూ చెబుతుంటాయి. శత్రువును మార్చడమన్నది మన సినిమా కథ.
* నా కెరీర్‌కు సంబంధించి 'ఎఫ్2' అనేది గేమ్ చేంజర్. అది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా కనెక్టయింది. అంతకు మించి 'సరిలేరు నీకెవ్వరు'కు కనెక్టవుతారు. ఇందులో ఎక్కడా హద్దులు దాటి కామెడీ చెయ్యలేదు. దేశభక్తి, వినోదం.. రెండూ బాగా ఒకదానితో ఒకటి మిళితమైన సినిమా ఇది.
* మహేశ్‌తో పని చేస్తున్నప్పుడు నేనొక సూపర్ స్టార్‌తో చేస్తున్నాననే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ఆయన నన్ను ఒక బ్రదర్‌లా ట్రీట్ చేశారు. సెట్స్‌పై చాలా సరదాగా ఉంటూ, నేను నెర్వస్‌నెస్ ఫీల్ కాకుండా చూసుకున్నారు. ఆయన చెయ్యని క్యారెక్టర్లు ఏమున్నాయి, చెయ్యని బ్లాక్‌బస్టర్లు ఏమున్నాయి! ఆయన కంటే, నాకు బాగా ప్లస్సయ్యే సినిమా ఇది.
* విజయశాంతి గారు ఎన్ని గ్లామరస్ రోల్స్ చేసినా ఆమెను చూస్తే 'పవర్ ఆఫ్ విమెన్'కు ప్రతీకలా అనిపిస్తారు. ఎందుకంటే.. ఆమె చేసిన పవర్‌ఫుల్ రోల్స్ అలాంటివి. ఈ మూవీలోనూ ఆమెది పవర్‌ఫుల్ క్యారెక్టర్. ఆమెను దృష్టిలో ఉంచుకొనే ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాను. ప్రొఫెసర్ భారతి పాత్ర ఆమె కోసమే పుట్టింది. ఈ సినిమాలో మహేశ్, ఆమె కలిసి నడిచే సీన్ చూస్తుంటే, ఆమెను కాకుండా మరొకర్ని అస్సలు ఊహించలేం.
* ఆర్మీ నుంచి ఒక మాసీ బ్యాక్‌డ్రాప్‌కు కథ మారుతుందనుకున్నప్పుడు కర్నూలు అయితే బాగుంటుందని అనిపించింది. కథకు అది బాగా సెట్టయింది. 'ఒక్కడు'లో కొండారెడ్డి బురుజు ఎంత ఫేమస్సయ్యిందో మనకు తెలుసు. అందుకే ఈ సినిమాలోనూ అది ఒక పాత్రలా కనిపిస్తుంది.
* 'పటాస్'తో నన్ను డైరెక్టర్‌గా మార్చి, నా కెరీర్‌కు ఓ లైఫ్ ఇచ్చారు కల్యాణ్ రామ్ గారు. అప్పట్నుంచీ నాకు ఏ హీరో దొరికితే వాళ్లంతోనే సినిమాలు చేసుకుంటూ వస్తూ, ఇప్పుడు మహేశ్‌తో చెయ్యగలిగా. నాది ఒక మెమరబుల్ జర్నీ. నేనొచ్చిన ట్రాక్ నాకు బాగా గుర్తుంది. ఇవాళ నేను మహేశ్‌తో చేసినా, ప్రతి సినిమానీ నేను స్టార్ హీరోతోటే చెయ్యాలని గిరిగీసుకోలేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరితో సౌకర్యంగా అనిపిస్తే వాళ్లతో సినిమాలు చేసుకుంటూ వెళ్తా.
* ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ అనేసరికి ప్రెజర్ ఫీలైన మాట నిజం. తర్వాత.. ఆ సమస్య పరిష్కారమవడం హ్యాపీ. నా సినిమాలు మాసీ లుక్‌తో కనిపిస్తే, త్రివిక్రమ్ గారి సినిమాలు క్లాసీ లుక్‌తో కనిపిస్తాయి. ఆయన సినిమాల్ని అభిమానించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. మా ఇద్దరి సినిమాలూ ఆడాలని కోరుకుంటున్నా. అలాగే నన్ను డైరెక్టర్‌గా పరిచయం చేసిన, నా తొలి సినిమా హీరో కల్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా' బాగా ఆడాలని ఆశిస్తున్నా.
* విమర్శల్ని నేను హెల్దీగా తీసుకుంటా. పర్సనల్‌గా రాస్తే కాస్త బాధనిపిస్తుంది. నా సినిమాల్లో కథలు నచ్చకపోతే జనం ఎందుకు చూస్తారు? నా ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం చెప్తూ వచ్చా. ఏ సినిమా అయినా చూసిన వందమందికీ నచ్చదు. 'ఎఫ్2' అనేది జబర్దస్త్‌కు కొనసాగింపుగా ఉందనే కామెంట్‌లో ఏమాత్రం పసలేదు. అదే నిజమైతే సినిమాని ఎందుకు చూస్తారు? టీవీ చూస్తూ కూర్చుంటారు కదా. 'ఎఫ్2'లో కుటుంబ విలువలు, పెళ్లి విలువ గురించి చెప్పాను.
* కామెడీలో నాకు ఇన్‌స్పిరేషన్ జంధ్యాల గారు. కామెడీలో మేనరిజమ్స్ పుట్టించిందే ఆయన. ఆయన సినిమాలు ఆరోగ్యకరమైన హాస్యానికి పెట్టింది పేరు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని. 'ఎఫ్2'లో 'అంతేగా.. అంతేగా' అనే మేనరిజం ఎలా పండిందో, ఈ సినిమాలో 'నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్' అనే మేనరిజం బాగా జనంలోకి వెళ్తుందనుకుంటున్నా.
* చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్స్‌తో పనిచేసే అవకాశం వస్తే వదులుకోకూడదని ఎప్పుడో అనుకున్నా. వాళ్లని డైరెక్ట్ చేయడమనేది ఒక అదృష్టం. వెంకటేశ్ గారితో చేసేశాను. బాలకృష్ణ గారితో ఇదివరకు చర్చలు జరిగాయి. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తాను. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే, ఎగిరి గంతేసి చేస్తాను. ఆయన 'ఊ' అన్న క్షణం నుంచి మూడు నెలల్లో కథ రెడీచేసి వినిపిస్తా.
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



