బన్నీ, నేనూ కలిసి యానిమేషన్ కోర్స్ చేద్దామనుకున్నాం!
on Jan 7, 2020

పందొమ్మిదేళ్ల క్రితం అల్లు అర్జున్‌కు మారుతి డ్రాయింగ్ టీచర్. అతనికి బొమ్మలు గీయడంలోని మెళకువల్ని మారుతి నేర్పేవాడు. ఆ టైంలో ఆయనను బన్నీ 'అంకుల్.. అంకుల్..' అని పిలిచేవాడు. ఈ విషయాన్ని తెలుగుఒన్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు మారుతి.
"ఇరవై ఏళ్ల నుంచీ అల్లు అరవింద్ గారు నాకు తెలుసు. 2000 సంవత్సరం ప్రాంతంలో బన్నీ నా దగ్గర డ్రాయింగ్ నేర్చుకుంటూ 'అంకుల్.. అంకుల్..' అంటూ సన్నిహితంగా ఉండేవాడు. వాళ్లప్పుడే చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. నేనేమో మచిలీపట్నం నుంచి యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చాను. అరవింద్ గారి భార్య మాకు దూరపు బంధువు. నేను డ్రాయింగ్ నేర్పిస్తానని తెలిసి, నాకు కబురుచేస్తే వెళ్లాను. అలా ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. బన్నీ, నేను కలిసి వాంకోవర్ యూనివర్సిటీకి వెళ్లి యానిమేషన్ కోర్స్ చేద్దామనుకున్నాం కూడా. కానీ ఈలోగా తను హీరో అయిపోయాడు. ఇప్పటికీ మేం తరచూ మాట్లాడుకుంటుంటాం. నా కెరీర్‌లో అరవింద్ గారి పాత్ర ఎక్కువ. వాళ్లింట్లో ఒక సభ్యుడిగా తిరిగాను. అందువల్ల ఆయనతో వర్క్ చేసేప్పుడు చాలా సౌకర్యంగా ఉంటాను.
నాలోని డ్రాయింగ్ కళ మా అమ్మాయికీ వచ్చింది. తనూ బాగా బొమ్మలు గీస్తుంటుంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతోంది. పాప తర్వాత బాబు ఉన్నాడు. వాడు సెవెన్త్ చదువుతున్నాడు. వాడు డ్రమ్స్ బాగా వాయిస్తాడు. వాడికి మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్. 'ప్రతిరోజూ పండగే'లోని 'ఓ బావా' సాంగ్‌లో మా అమ్మాయి నటించింది. అందుకే ఈమధ్య స్టేజి మీద అరవింద్ గారు తనకు రెమ్యూనరేషన్ కింద లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు.
నాకున్న కోరిక అల్లా ఒక్కటే.. నేను ఉన్నంత కాలం గుర్తుండిపోయే సినిమాలు తియ్యాలి. ఆ సినిమా వల్ల సొసైటీకి ఎంతోకొంత చెప్పగలగాలి. ఏ అంశంపైన అయినా భవిష్యత్తులో డిస్కషన్ వచ్చినప్పుడు ఫలానా డైరెక్టర్ దీనిపై సినిమా తీశాడని చెప్పుకోవాలి. గుంపులో గోవిందంలా అనిపించుకోకూడదు. ఇవాళ హైదరాబాద్‌లో సొంత ఆఫీసును ఇలా మెయిన్‌టైన్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది దేవుడిచ్చిన బోనస్ అనుకుంటాను. అయితే ఇవన్నీ ఉన్నాయని కళ్లు నెత్తిన పెట్టుకోను. నా మూలాల్లోనే ఉంటాను" అని మారుతి చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



