ప్రభాస్ సాక్షిగా 'జాతిరత్నాలు-2' చేస్తానని చెప్పిన దిల్ రాజు!
on Dec 23, 2021

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు, నిర్మాత దిల్ రాజు, దర్శకులు ఓం రావత్, నాగ అశ్విన్, సందీప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ సాక్షిగా.. జాతిరత్నాలు-2 సినిమా చేస్తానని దిల్ రాజు చెప్పడం విశేషం.
'రాధే శ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ అవతారమెత్తాడు. గెస్ట్ లతో సరదాగా మాట్లాడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. 'అన్నా మీరు ఈ సినిమాలో పామ్ రీడర్ కదా.. నా చెయ్యి చూసి లవ్ లైన్ ఉందో లేదో చెప్పండి' అని నవీన్ అడగడంతో ప్రభాస్ లవ్ లైన్ ఉందని చెప్పాడు. ఆ తర్వాత మిగతా గెస్ట్ లను అడుగుతూ దిల్ రాజు దగ్గరకు వెళ్లిన నవీన్.. 'నా చెయ్యి చూసి మీ బ్యానర్ లో నాకు సినిమా ఉందేమో చెప్పండి' అని అడిగాడు. నవీన్ చెయ్యి చూసిన దిల్ రాజు.. 'జాతిరత్నాలు సీక్వెల్ చేయబోతున్నట్లు ఉంది' అని చెప్పాడు. హీరో నేనేగా సార్? అని నవీన్ అడగగా.. నువ్వు హీరో, నేను ప్రొడ్యూసర్ అని చెప్పి షాక్ ఇచ్చాడు దిల్ రాజు.
ఇక ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి కూడా నవీన్ సరదా వ్యాఖ్యలు చేశాడు. అందరి సినిమాలకు ఫైనాన్సియర్స్ ఉంటారు, కానీ ప్రభాస్ అన్నా సినిమాలకి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. వచ్చే ఏడాది నుండి పార్లమెంట్ లో ప్రభాస్ అన్న సినిమాలకు బడ్జెట్ ప్రవేశ పెట్టాలేమో.. రూ.500 కోట్లు, రూ.2000 కోట్లు అంటూ డార్లింగ్ ప్రభాస్ ని కూడా నవ్వించాడు నవీన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



