టాక్ కి, కలెక్షన్లకి సంబంధమే లేదు!
on Dec 28, 2022

గత శుక్రవారం 'ధమాకా'తో రవితేజ, '18 పేజెస్'తో నిఖిల్ ప్రేక్షకులను పలకరించారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న 'ధమాకా' మంచి కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుండగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న '18 పేజెస్' మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ధమాకా ఐదు రోజుల్లోనే రూ.21.50 కోట్ల షేర్ రాబట్టి ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది. మరోవైపు '18 పేజెస్' మాత్రం బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉంది. దీంతో ఈమధ్య టాక్ కి, కలెక్షన్లకి సంబంధం ఉండట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'కార్తికేయ-2' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడంతో '18 పేజెస్' మంచి ఓపెనింగ్స్ రాబడుతుందని భావించారంతా. పైగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేవు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల లోపు షేర్ కి పరిమితమైన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ.6.75 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా. రూ.12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. బాక్సాఫీస్ విన్నర్ గా నిలవాలంటే ఇంకా దాదాపు రూ.6 కోట్లు రాబట్టాల్సి ఉంది. 'ధమాకా' దూకుడుని తట్టుకొని నిలబడి '18 పేజెస్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'18 పేజెస్' మౌత్ టాక్ తోనే ప్రస్తుతం రోజుకి కోటి దాకా వసూలు చేస్తోంది. దానికి తోడుగా మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచితే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ధమాకా తప్ప సంక్రాంతి దాకా పెద్ద సినిమాల తాకిడి లేదు. మరి ఇప్పటికైనా '18 పేజెస్' టీమ్ మేల్కొని సినిమాని బ్రేక్ ఈవెన్ దిశగా నడిపిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



