శివశంకర్ మాస్టర్ ఇకలేరు.. బలితీసుకున్న కరోనా!
on Nov 28, 2021

సీనియర్ కొరియోగ్రాఫర్, పలు పాపులర్ సాంగ్స్‌కు డాన్స్ కొరియోగ్రఫీ చేసిన శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌కు గురై కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఈ రోజు (నవంబర్ 28) రాత్రి 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబంలో ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కుమారుడు విజయ్ కూడా హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నారు. భార్య హౌస్ క్వారంటైన్‌లో ఉన్నారు.
చిన్నకుమారుడు అజయ్ మిగతా ముగ్గురి బాగోగులు చూసుకుంటూ వస్తున్నాడు. అయితే రోజువారీ ఖర్చు లక్షల్లో ఉండటంతో ఆర్థిక సాయం చేయాల్సిందిగా సినిమా పెద్దల్ని అతను ఇటీవల అర్థించాడు. అజయ్‌ను తన ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి, అతనికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. నటుడు సోను సూద్ కూడా తన వంతు సాయం అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ శివశంకర్‌ను బతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే చనిపోయే సమయానికి ఆయనకు కరోనా నెగటివ్ అని తేలింది.
శివశంకర్ 1978 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. సలీమ్ మాస్టర్ దగ్గర 1974లో అసిస్టెంట్‌గా చేరడం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివశంకర్, ఆ తర్వాత దేశంలోని పలు భాషా చిత్రాల్లోని పాటలకు నృత్యాలు సమకూర్చారు. 800కు పైగా చిత్రాలకు ఆయన పనిచేశారు. కొన్ని సినిమాల్లో నటుడిగానూ ఆయన కనిపించారు. రాజమౌళి సినిమా 'మగధీర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 2011లో జాతీయ అవార్డును అందుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



