దర్శకుడి హ్యాట్రిక్ ఎటెంప్ట్.. విక్రమ్ కి ప్లస్సయ్యేనా?
on Jun 14, 2021
పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే కథానాయకుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. అంకితభావం ఉన్న నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ స్టార్.. సాలిడ్ సక్సెస్ చూసి పదహారేళ్ళవుతోంది. `అనియన్` (అపరిచితుడు) (2005)తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న విక్రమ్.. ఆ తరువాత మళ్ళీ హిట్ ముఖం చూసిందే లేదు. `అపరిచితుడు` దర్శకుడు శంకర్ కాంబినేషన్ లోనే `ఐ` (2015) చేసినా.. భారీ బడ్జెట్ కారణంగా నిరాశతప్పలేదు. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాలపైనే తన ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్.
మరీముఖ్యంగా.. `కోబ్రా` పేరుతో రూపొందుతున్న చిత్రంపై విక్రమ్ గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఇందులో ఏకంగా 20 వేషాల్లో దర్శనమివ్వనున్నాడీ స్టార్ హీరో. అంతేకాదు.. `డిమాంటి కాలనీ`, `ఇమైక్కా నొడిగళ్` (తెలుగులో `అంజలి సీబీఐ`) వంటి రెండు విజయవంతమైన చిత్రాల తరువాత యువ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు చేస్తున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ కావడంతో.. `కోబ్రా`తో తను కోరుకుంటున్న సక్సెస్ ని చూస్తానన్న ఆశాభావంతో ఉన్నాడు విక్రమ్. మరి.. అజయ్ జ్ఞానముత్తు ట్రాక్ రికార్డ్ విక్రమ్ కి ప్లస్ అవుతుందేమో చూడాలి.
కాగా, స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్న `కోబ్రా`లో `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా తెరపైకి రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
