చిరంజీవి తనపై ఉన్న అపవాదును చెరిపివేయాలనుకుంటున్నారా?
on Dec 29, 2022

దాసరి నారాయణరావు చెప్పినట్టు ఒక దర్శకుడు, నిర్మాత ఒక స్టార్‌ని క్రియేట్ చేయగలరు. గాని ఒక స్టార్ దర్శక, నిర్మాతలను తయారు చేయలేదు అనేది వాస్తవం. ఇంకా చిరంజీవి విషయానికి వస్తే ఆయన స్వయంకృషితో ఎంతో కష్టపడి మెగాస్టార్ గా ఎదిగారు. అయితే ఆయనకు కెరీర్ ప్రారంభంలో పలు అవకాశాలు ఇచ్చి నష్టపోయిన నిర్మాతలు ఉన్నారు. వారికి ఆయన తిరిగి సినిమాలు చేసి వారిని నిలబెట్టే ప్రయత్నం చేయలేదనే అపవాదు టాలీవుడ్ వర్గాల్లో నిత్యం నలుగుతూనే ఉండే అంశం. తనతో పాటు నటులై తమకు వచ్చిన హీరో అవకాశాన్ని కూడా చిరంజీవికి ఇచ్చిన కమెడియన్ సుధాకర్, నారాయణరావు, ప్రసాద్ బాబు, హరిప్రసాద్, సాయి చందు వంటి వారిని ఆయన మంచి స్థాయిలో ఉండి కూడా లిఫ్ట్ చేయలేకపోయాడని అంటారు, ఇక చిరంజీవికి కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాత క్రాంతి కుమార్, జయకృష్ణ, కె. రాఘవ, సంయుక్త మూవీస్ అధినేతలు, మిద్దె రామారావు, త్రివిక్రమ రావు, చలసాని గోపి వంటి వారికి ఆయన మరల చిత్రాలు చేయలేదని అంటారు.
ముఖ్యంగా ఈ విషయంలో నిర్మాత జయకృష్ణ ఒకసారి దీనపరిస్థితిలో ఉండి ఇన్‌డైరెక్ట్ గా చిరంజీవి తనను ఆదుకోలేదన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడని అంటారు. ఈ అపవాదు ఎప్పటినుంచో చిరంజీవిపై వస్తూనే ఉంది.తనకు సాయం చేసిన కెరీర్ మొదలైన నాటి నటులకు డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై ఒక్క యముడికి మొగుడు చిత్రం మాత్రం చేశాడు. ఒకసారి కమెడియన్ సుధాకర్ ఇప్పుడు మేం చిరంజీవికి గుర్తులేం. ఆయనకు అల్లు అరవింద్, అశ్వనీదత్‌లే కావాలి అంటూ బాధపడ్డాడని నాడు పత్రికల్లో వచ్చింది. కానీ అదే సమయంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తనని నటునిగా నిలబెట్టిన బాలచందర్‌తో పాటు కెరీర్ మొదట్లో తన ఎదుగుదలకు కారణమైన వారిని గుర్తుంచుకొని మరీ సినిమాలు చేసి ఆదుకుంటాడని అంటారు. ఇక ఈ అపవాదును మెగాస్టార్ చిరంజీవి తొలగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హోదాలో టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే సమాజం గురించి బాగా ఆలోచించి పలు కార్యక్రమాలు చేపట్టారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంకు ద్వారా ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపాడు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణించడం చూసి చలించిపోయిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక కరోనా సమయంలోను ఆ తరువాత కూడా సినీ కార్మికుల కోసం మరెన్నో భారీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. చారిటీపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు నేను నా కుటుంబం గురించి ఆలోచించాను. ఇకపై సమాజానికి తిరిగి ఇవ్వడం మీద దృష్టి పెడతాను. ఎంతో మంది గొప్పస్టార్స్, గొప్ప నటులు, దర్శకనిర్మాతలు చివరి దశలో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాపం వారు ఎంత సంపాదించినా చివరికి ఏమీ నిలబెట్టుకోలేకపోయారు. అందుకే నా కుటుంబానికి అస్సలు రాకూడదని, నాకు సాధ్యమైనంత వారికి సంపాదించి పెట్టాలని నిన్నటి వరకు ఆలోచించాను. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని జాగ్రత్త పడ్డాను.
కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. పిల్లలందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇప్పుడు వారి కోసం దాచి పెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుని దయవలన ఆయన నాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు. వ్యక్తిత్వమే శాశ్వతం. ఇకపై నా జీవితం చారిటీకే అంకితం. ఎంతైనా దానం చేస్తాను. సినిమాల ద్వారా వస్తున్న డబ్బులు కూడా చారిటీకే ఉపయోగిస్తాను అన్నారు. చిరంజీవిలో ఉన్నట్టుండి ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఆయన చెప్పింది నిజమేనని ఇకపై ఆయన తనకు కెరీర్ మొదట్లో తన ఎదుగుదలకు సహకరించిన వారికి ఇకనైనా తిరిగి సాయం చేయాలని భావిస్తున్నాడని... ఇది మంచి పరిణామం అని అనుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ చూసిన మెగాస్టార్ అభిమానులు మెగాస్టార్ ఎప్పటికి మెగాస్టారే. ఆయన మంచి మనసు అందరికీ ఉండడం అసాధ్యం అంటూ ఆయనను ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌బాబు... తిరిగి ఇవ్వాలి.. లేకపోతే లావైపోతామనే డైలాగ్ ఇక్కడ మనకు గుర్తురాక మానదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



