బాలయ్య కోరిక ఈసారైనా తీరుతుందా?
on Dec 29, 2022

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎప్పటినుంచో తన దర్శకత్వ ప్రతిభను కూడా చాటాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో నర్తనశాల అనే చిత్రాన్ని కూడా తన సొంత డైరెక్షన్లో మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం అన్నపూర్ణ ఏడెకరాల్లో భారీ సెట్ వేసి కొన్ని సీన్స్ ను కూడా చిత్రీకరించారు. ఉదయ్ కిరణ్ తో పాటు పలువురు నటీనటులను ఎంచుకొని షూటింగ్ ప్రారంభించినప్పటికీ ప్రధాన పాత్ర అయినా ద్రౌపతి పాత్రధారి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మరి అపశకునంగా భావించారో లేక ద్రౌపతి పాత్రకు సౌందర్య తప్ప ఎవరు సూట్ కారు... అది కేవలం సౌందర్య మాత్రమే చేయగలదు అనుకున్నారో ఏమో గాని ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.
శ్రీరామరాజ్యం తర్వాత సీతగా మెప్పించిన నయనతారతో ద్రౌపది పాత్ర చేయిస్తారని వార్తలు వచ్చినా బాలయ్య మాత్రం మౌనం వహించారు. అసలే బాలయ్యకు సెంటిమెంట్ ఎక్కువ. అడుగు పెట్టాలన్న, షూటింగ్ మొదలు పెట్టాలన్న, టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రతి విషయంలోనూ మంచి ముహూర్తాలు చూసుకుని గాని ప్రారంభించరు. ఇక విషయానికి వస్తే బాలయ్య చూపు ఇప్పుడు ఆదిత్య 369 కి సీక్వెల్ గా రూపొంద పోయే ఆదిత్య 999 మాక్స్ పై పడిందట. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేయడంలో బిజీ కానున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ మెగా ఫోన్ పట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు చాలామంది.
వచ్చే ఏడాదిలో నందమూరి బాలకృష్ణ తన సొంత దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ పక్కాగా ఫైనల్ కావడంతో ఈ మూవీని 2023 ఫిబ్రవరిలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. ఈ మూవీ ద్వారా ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఓ కీలకపాత్రను బాలయ్య సైతం పోషించనున్నారట. వాస్తవానికి బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి టైంలోనే ఆదిత్య 369 దర్శకుడైన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కలయికలో ఈ మూవీ తీయాలని భావించారు. కానీ ఆ టైంలో సింగీతం బాలకృష్ణ లకు కథ సంతృప్తిగా నచ్చకపోవడంతో దాని పక్కన పెట్టారు. మొత్తానికి బాలయ్య దర్శకుడు అయ్యే శుభతరుణం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి...!
ఇక ఈ చిత్రాన్ని సొంతంగా బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్, బాలయ్య కూతురు భరత్ శ్రీమతి అయినా తేజస్వినిల స్వీయ నిర్మాణంలో రూపొందనుందని సమాచారం. అంటే దాదాపు ఇది బాలయ్య సొంత సినిమాతో సమానమని చెప్పవచ్చు. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో దెబ్బతిన్న బాలయ్య ఈసారైనా నిర్మాతగా దర్శకునిగా తన సత్తా చాటాలని అందరూ కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



