ENGLISH | TELUGU  

చిరంజీవి వ‌ర్సెస్ గ‌రిక‌పాటి.. ప్ర‌వ‌చ‌న‌క‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌పై మండిప‌డుతున్న జ‌నం!

on Oct 7, 2022

 

అంద‌రికీ నీతులు, మంచి మాట‌లు చెప్తూ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌గా పాపుల‌ర్ అయిన వ్య‌క్తి.. త‌న విష‌యానికి వ‌స్తే మాత్రం.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఏమ‌నుకోవాలి! చెప్పేటందుకే నీతులు, చెయ్య‌డానికి కాదు అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే.. అలాంటి వ్య‌క్తిని ఏమ‌నాలి?.. ఇప్పుడు పాపుల‌ర్‌ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు గురించి తెలుగునాట అనేక‌మంది జ‌నం అనుకుంటున్న మాట‌లివే.

"అక్క‌డ మొత్తం ఫొటోల సెష‌న్ ఆగిపోతే నేను మాట్లాడ‌తానండీ, లేక‌పోతే వెళ్లిపోతాను. నాకేం మొహ‌మాటంలే. అక్క‌డ ఆపెయ్యాలి. చిరంజీవి గారూ ద‌య‌చేసి మీరాపేసి, ఈ ప‌క్క‌కు రండి. నేను మాట్లాడ‌తా. చిరంజీవి గారికి నా విజ్ఞ‌ప్తి.. ఫొటో సెష‌న్ ఆపేసి ఇక్క‌డ‌కు రావాలి. లేక‌పోతే నాకు సెల‌విప్పించండి." అని లేవబోతుంటే, నిర్వాహ‌కులు గ‌రిక‌పాటి న‌ర‌సింహారావును ప‌ట్టుకొని వెళ్ల‌వ‌ద్దంటూ బ‌తిమ‌లాడారు.

ఇదంతా బీజేపీ సీనియ‌ర్ నేత‌, హ‌రియాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హైద‌రాబాద్‌లో ఇచ్చిన 'అలాయ్ బ‌లాయ్' కార్య‌క్ర‌మంలో జ‌రిగింది. ఈ వేడుక‌కు అనేక‌మంది రాజ‌కీయ‌, సినీ, వ్యాపార, సామాజిక రంగాల‌ ప్ర‌ముఖ‌లు హాజ‌ర‌య్యారు. వాళ్లంద‌రి స‌మ‌క్షంలో మెగాస్టార్ చిరంజీవి విష‌యంలో గ‌రిక‌పాటి వ్య‌వ‌హ‌రించిన తీరుతో అక్క‌డున్న వాళ్లంతా షాక‌య్యారు. 

అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌లువురు అమ్మాయిలు చిరంజీవితో ఫొటోలు దిగాల‌ని ఆరాట‌ప‌డుతుంటే, వారిని ఆప్యాయంగా పిలిచి ఫొటోలు దిగుతున్న చిరంజీవి కూడా గ‌రిక‌పాటి తీరుతో అవాక్క‌య్యారు. అయితే ఆయ‌న సంయ‌మ‌నం కోల్పోకుండా గ‌రిక‌పాటి మాట‌ల‌ను గౌర‌వించి, ఆ ఫొటోలు తీసుకోవ‌డం ఆపేశారు. గ‌రిక‌పాటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశారు. అప్పుడు కూడా చిరున‌వ్వుతూనే ఉన్నారు కానీ, గ‌రిక‌పాటి త‌న‌ను చిన్న‌బుచ్చార‌న్న భావ‌న‌ను క‌న‌ప‌ర్చ‌లేదు. 

కాగా, చిరంజీవి లాంటి గొప్ప ఇమేజ్ క‌లిగిన న‌టుడ్ని ప‌ట్టుకొని ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు చేసిన వ్యాఖ్య‌లు, ప్ర‌వ‌ర్తించిన తీరుతో చిరు అభిమానుల‌తో పాటు, చిత్ర‌సీమ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. "అంత‌కుముందే త‌న ప్ర‌సంగంలో ఎంతో గౌర‌వంగా గ‌రిక‌పాటి గురించి మాట్లాడి, ఆయ‌న‌పై త‌న అభిమానాన్ని ప్రద‌ర్శించిన‌ చిరును ప‌ట్టుకొని ఆయ‌న అట్లా మాట్లాడ‌తారా? ఏం చూసుకొని అంత అహంకారం, అంత మిడిసిపాటు?" అని అడుగుతున్నారు. "అంద‌రికీ మంచి మాట‌లు చెప్పే వ్య‌క్తి, త‌ను కొద్దిసేపు సంయ‌మ‌నం పాటించి, విన‌యంగా న‌డ‌చుకోలేరా?" అని ప్ర‌శ్నిస్తున్నారు. న‌లుగురిలో ఉన్న‌ప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తించాలో చిరును చూసి నేర్చుకొన‌మ‌ని గ‌రిక‌పాటికి స‌ల‌హా ఇస్తున్నారు.

ఆమ‌ధ్య‌నే 'పుష్ప' సినిమానీ, అందులో అల్లు అర్జున్ పోషించిన క్యారెక్ట‌ర్‌నీ విమ‌ర్శించిన గ‌రిక‌పాటిపై ఫైర్ అయిన సినీ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌. ఆదిత్య‌.. మ‌రోసారి గ‌రిక‌పాటి పేరును ప్ర‌స్తావించ‌కుండా.. చిరంజీవిని శ్రీ‌రామునితోనూ, గ‌రిక‌పాటిని రావ‌ణునితోనూ పోలుస్తూ త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో సునిశితంగా విమ‌ర్శించారు. 

"రాముడు వినయంగా ఉండడం వల్లే "హీరో" అయ్యాడు.. రావణబ్రహ్మ మహా విజ్ఞాని, గొప్పవాడు అయినా అహంకారం వల్ల విలన్ అయ్యాడు..
అశోకవనంలో సీతా దేవి "గడ్డిపరక"తో ఎవరిని పోల్చిందీ..? విన‌యంగా ఒదిగున్న హీరోనా.. విజ్ఞానమున్నా, అహంతో ఎగిరిపడ్డ విలన్నా..
కొంచెం తెలిస్తే చెప్పండి..( నాక్కాదు )" అని ఆయ‌న రాసుకొచ్చారు.

దానికంటే ముందు.. "మాట్లాడితే 'నేనెళ్లి పోతాను, నేనెళ్లి పోతాను' అని గింజుకోకూడదు.. అందరమూ ఏదో ఒకరోజు వెళ్లి పోవలసిన వారమే అని తెలుసు కాబట్టి.. ఉన్నన్నాళ్లు వినయంతో, విజ్ఞతతో, సహనంతో, సంయమనంతో మసలుకోవాలి.. లేకపోతే మనం పోయాక సమాజం కొంతైనా మన గురించి నిజం చెప్పదింక.. కళాకారుడిదేముంది.. మరణానంతరం కూడా మనుగడ ఉన్న అరుదైన గొప్ప వరం ఉంది.. అందుకే మనసులో నవ్వుకున్నా, పైకి వినయంగా ఉంటాడు.. తన పని తాను కాయకష్టంగా చేసుకుంటూ పోతాడు.. పదిమందిని ప్రభావితం చేయగలిగిన అశేష ప్రజాభిమానం ఉన్నవాడు వినయంగా ఉన్నాడంటేనే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం చేసుకుని కుదురుగా ఉండాలి.." అని చిరంజీవిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ గ‌రిక‌పాటిని ఏకేశారు.

మొత్తానికి.. "చెప్పేవాడికి వినేవాడు లోకువ" అనే నానుడిని మ‌రోసారి గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు నిజం చేశార‌ని విజ్ఞులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంద‌రికీ నీతులు చెప్పే ఆయ‌న‌, తన‌కి మాత్రం అవి వ‌ర్తించ‌వ‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం.. ఆయ‌న గౌర‌వాన్నే త‌గ్గించివేస్తాయ‌ని గ్ర‌హించాల‌ని వారు సూచిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.