గరికపాటి గారు ఇక్కడ లేరు కదా!.. చిరు ఛలోక్తి!!
on Oct 29, 2022

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయనను చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు జనాలు ఎగబడతారు. ఇటీవల అలై బలై కార్యక్రమంలో కూడా మెగాస్టార్ తో ఫోటో దిగేందుకు అక్కడి వారు పోటీ పడగా.. అదే సమయంలో వేదికపై ప్రసంగిస్తున్న గరికపాటి నరసింహారావు అసహనానికి గురయ్యారు. ఫోటోలు ఆపకపోతే తాను వేదిక దిగి వెళ్లిపోతానని అన్నారు. దీంతో అది వివాదానికి దారి తీసింది. ఇప్పుడిప్పుడే అందరూ దానిని మర్చిపోతున్న సమయంలో తాజాగా చిరంజీవి ఆ ఘటనను గుర్తు చేసుకొని ఛలోక్తి విసరడం ఆసక్తికరంగా మారింది.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ప్రభు 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' అనే ఒక పుస్తకాన్ని రచించి చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవితో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపించడం చర్చనీయాంశమైంది. వారంతా సినీ పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు అలాగే పలువురు ఉన్నతాధికారుల భార్యలు. అయితేనేమి మెగాస్టార్ అభిమానులే. అందుకే అక్కడ ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధమైన చిరంజీవి.. కొద్ది రోజుల క్రితం ఇలానే తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటే గరికపాటి చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ "ఆయన ఇక్కడ లేరు కదా" అంటూ చిరు చలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



