కొత్తవారికి ద్వారాలు తెరుస్తున్న మెగాస్టార్!
on Dec 28, 2022

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి భయపడేవారు. తన రేంజ్, ఇమేజ్, తన నుంచి అభిమానులు ఆశించే అంశాలను వారు సరిగా హ్యాండిల్ చేయగలరా? అనే అనుమానం ఆయనకు ఉండేది. దాంతో చేసిన దర్శకులకే మరలా మరలా అవకాశాలు ఇస్తూ వచ్చారు. కానీ ఆయనలో చాలా కాలం కిందటే మార్పు కనిపించింది. వి.వి. వినాయక్‌కి ఇచ్చిన అవకాశాలు ఆయన సద్వినియోగం చేసుకోవడంతో ఆయనలో ఒక రకమైన నమ్మకం ఏర్పడింది. అదే జోరులో శ్రీను వైట్ల, విజయభాస్కర్, మురుగదాస్, ప్రభుదేవా, సురేందర్‌రెడ్డి, కొరటాల శివ వంటి వారికి అవకాశం ఇచ్చారు. కానీ వీరెవ్వరు చిరుని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. చిరంజీవి ఇటీవల ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ కి రీమేక్ 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటించారు. వాస్తవానికి మోహన్ రాజా తెలుగులో వచ్చిన 'ధ్రువ' ఒరిజినల్ వెర్షన్ కి తమిళంలో దర్శకుడు. ఆ ప్రతిభతోనే ఆయన చిరుని ఆకట్టుకున్నాడని అర్థమవుతుంది.
ఇక ప్రస్తుతం ఆయన ఎలాంటి బంపర్ హిట్ లేకపోయినా పవన్, ఎన్టీఆర్, వెంకటేష్‌లను బాగానే హ్యాండిల్ చేసిన బాబీతో 'వాల్తేరు వీరయ్య' చిత్రం చేస్తున్నారు. దీని తరువాత 'కంత్రి', 'శక్తి', 'షాడో' వంటి డిజాస్టర్స్ ఇచ్చిన మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోళా శంకర్' ని రెడీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, వెంకీ వంటి వారితో డిజాస్టర్స్ తీసి ఏమాత్రం మెప్పించలేకపోయిన మెహర్ రమేష్‌కి చాన్స్ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి మెహర్ రమేష్‌ని మంచి టెక్నీషియన్ అని చెప్పవచ్చు గానీ మంచి దర్శకుడు అని చెప్పలేం. పోనీ చిరు ఇచ్చింది రీమేకే కదా...! అనుకుందామనుకున్నప్పటికీ రీమేక్‌గా ప్రభాస్‌తో తీసిన 'బిల్లా' చిత్రం కూడా ఆశించిన రీతిలో ఆడలేదు కదా... ఇలాంటి సమయంలోనే చిరు మరో ఇద్దరికి కూడా చాన్సులు ఇస్తానని మాట ఇచ్చారు. కానీ వారి దగ్గర చిరుకి తగ్గ స్టోరీలు లేవని సమాచారం.
చిరంజీవి తన 150వ చిత్రం కోసం పూరి జగన్నాథ్ చెప్పిన 'ఆటో జానీ స్టోరీ' విన్నారు. కానీ పూర్తిగా నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టేసి 'ఖైదీ నెంబర్ 150' చేశారు. పూరి డైరెక్షన్ అంటే ఆయన సోదరుడు నాగబాబుకి బాగా ఇష్టం. ఇక పూరీ కెరీర్ బిగినింగ్‌లోనే పవన్ కల్యాణ్‌కు 'బద్రి వంటి' సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత 'కెమెరామెన్ గంగతో రాంబాబు' తీశాడు. ఇక విషయానికి వస్తే తాజాగా పూరితో జరిగిన ఇంటరాక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి పూరీకి ఆఫర్ ఇచ్చారు. "ఆటో జానీ పూర్తి కథ సిద్ధం చేస్తారా? లేదా మరో కథతో అప్రోచ్ అవుతారా? అన్నది మీ ఇష్టం.. నేను రెడీ" అని చిరంజీవి చెప్పేశారు. ఇక ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన 'రంగ మార్తాండ' ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవి "మీలాంటి దర్శకులు సరైన కథ దొరికేవరకు నన్ను సంప్రదించరు. కానీ మీరు ఒక అడుగు ముందుకు వేస్తే కథలు ఆటోమేటిగ్గా వస్తాయి. నేను మీ దర్శకత్వంలో పని చేయాలనుకుంటున్నాను" అని డైరెక్ట్ గా కృష్ణవంశీకి చెప్పేశారు.
ఒకవైపు పూరి 'లైగర్' వంటి డిజాస్టర్ తో ఇబ్బందులు పడుతుండగా.. కృష్ణవంశీ హిట్ కొట్టి చాలా కాలమైంది. 'చందమామ' తర్వాత ఈయన తీసిన శశిరేఖా పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం వంటి చిత్రాలన్నీ ఏమాత్రం ఆడలేదు. ఇందులో చిరంజీవి తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే', చిరు మేనల్లుడు సాయి తేజ్ నటించిన 'నక్షత్రం' చిత్రాలు కూడా ఉండడం విశేషం. అయినా కూడా చిరు తన కెరీర్‌లో ఎప్పుడూ లేనివిధంగా ఇలా పూరీ, కృష్ణవంశీ వంటి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తనతో ఇప్పటివరకు పనిచేయని దర్శకులు అయితే సరికొత్త యాంగిల్ లో చూపిస్తారనే ఆశతో చిరు ఉన్నారని... అందుకే సీనియర్లను, ఆల్‌రెడీ తనతో పనిచేసిన వారినే మరలా మరలా పెట్టుకోకుండా కొత్తవారికి ఛాన్సులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి పూరి, కృష్ణవంశీలు చిరుకి తగ్గ స్టోరీని సిద్ధం చేసి ఎప్పుడు రెడీ అవుతారో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



