శివశంకర్ మాస్టర్ వైద్యం కోసం చిరంజీవి సాయం.. మూడు లక్షలు!
on Nov 26, 2021

కొవిడ్ 19 బారినపడి హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్న వెటరన్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి చేయూత నందించారు. గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు శివశంకర్. ఆయన పెద్దకుమారుడు సైతం అపస్మారక స్థితిలో కొవిడ్‌తో పోరాడుతూ వున్నారు. భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె తమ ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. తమ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చవుతున్నాయనీ, తమకు సాయం చెయ్యాలనీ సినీ పెద్దలను శివశంకర్ చిన్నకుమారుడు అజయ్‌కృష్ణ కోరారు.
విషయం తెలిసిన చిరంజీవి వెంటనే అజయ్‌కు ఫోన్‌చేసి, అతడిని తమ ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా రూ. 3 లక్షల చెక్కును అతనికి అందజేశారు. శివశంకర్ మాస్టర్‌కు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. "మీ కుటుంబానికి మేమంతా ఉన్నాం" అంటూ అభయమిచ్చారు. చిరంజీవి చేసిన సాయానికి అజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.
"నాన్నగారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు" అని చెప్పాడు. చిరంజీవిగారు అంటే తన తండ్రికి ఎంతో అభిమానం అని తెలిపిన అజయ్, "ఇటీవల 'ఆచార్య' షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిగారిని కలిశారు." అని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అతను, చిరంజీవి చేసిన సాయం ఎన్నటికీ మరువలేననీ, ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాననీ అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



