చిరు కోసం.. అచ్చొచ్చిన బాటలో మెహర్?
on May 6, 2020

దర్శకుడిగా ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా.. స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్న వైనం మెహర్ రమేష్ సొంతం. జూనియర్ ఎన్టీఆర్ (‘కంత్రి’, ‘శక్తి’), ప్రభాస్ (‘బిల్లా’), వెంకటేష్ (‘షాడో’).. ఇలా తెలుగునాట మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ అగ్ర కథానాయకుల చిత్రాలే కావడం విశేషం. ఈ పరంపరలోనే సుదీర్ఘ విరామం అనంతరం మరో అగ్రశ్రేణి కథానాయకుడితో సినిమా చేయబోతున్నాడు మెహర్. ఆ టాప్ స్టార్ మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి.
ఇటీవలే చిరు ఈ విషయాన్ని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించాడు కూడా. తాజా సమాచారం ప్రకారం.. చిరు, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా.. ఓ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కి రీమేక్ అని తెలిసింది. అజిత్ కథానాయకుడిగా రూపొందిన ‘వేదాళం’(2015) ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని వినికిడి. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పు చేర్పులు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పటి వరకు మెహర్ రమేష్ ఆరు చిత్రాలను డైరెక్ట్ చేయగా వాటిలో మూడు సినిమాలు రీమేక్‌లే కావడం విశేషం. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన కన్నడ చిత్రాలు ‘వీర కన్నడిగ’.. ‘అజయ్’.. తెలుగు సినిమాలు ‘ఆంధ్రావాలా’, ‘ఒక్కడు’కి రీమేక్ వెర్షన్స్. ఇక ప్రభాస్ హీరోగా మెహర్ తెరకెక్కించిన ‘బిల్లా’.. అదే పేరుతో రూపొందిన తమిళ చిత్రంకి రీమేక్ అనే విషయం తెలిసిందే. రీమేక్ చేసిన మూడు సందర్భాల్లోనూ మెహర్‌కి ఫర్వాలేదనపించే ఫలితాలే దక్కాయి. ఎటొచ్చి స్ట్రెయిట్ ఫిలిమ్స్ టేకప్ చేసిన సందర్భాల్లోనే నిరాశాజనక ఫలితాలు దక్కాయి.
ఈ నేపథ్యంలో చిరుతో చేయబోతున్న రీమేక్ మెహర్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



