దాసరి కుమారులపై కేసు నమోదు
on Jul 31, 2021

ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామంటూ బెదిరించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరితో ఆయన సన్నిహితంగా ఉండేవారు. దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు 2012-2014 మధ్య పలు దఫాలుగా సోమశేఖర్ వద్ద రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో దాసరి మృతి చెందారు. దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు ప్రభు, అరుణ్ 2018 నవంబరు 13న రూ.2.10 కోట్ల బదులు రూ.1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు.
దాసరి కుమారులు ఆ డబ్బును ఇంకా ఇవ్వకపోవడంతో ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి సోమశేఖర్ వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగారు. అయితే వారు డబ్బులు ఇవ్వకపోగా మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ ఆయనను బెదిరించారట. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభు, అరుణ్ లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



