బోయపాటి... దానయ్య పంచాయతీ!
on Feb 7, 2019
దర్శకుడు బోయపాటి శ్రీను, 'వినయ విధేయ రామ' చిత్ర నిర్మాత డివివి దానయ్య మధ్య గొడవ జరిగినట్లు ఇండస్ట్రీ టాక్. ఒకరినొకరు చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందట. ఇద్దరూ కొట్టుకోలేదు గాని పచ్చి బూతులు తిట్టుకున్నారని గొడవ జరిగినప్పుడు చూసినవారు తమకు తెలిసిన వారికి చెబుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గొడవకు కారణం 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కావడమే. సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు కొన్నారు. సినిమా ఫ్లాప్ కావడంతో నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను భర్తీ చేయడానికి నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ ముందుకు వచ్చారట. డిస్ట్రిబ్యూటర్లకు మొత్తం 30 కోట్లు నష్టాలు వచ్చాయని ఓ అంచనా. అందులో 15 కోట్లు వెనక్కి ఇవ్వడానికి నిర్మాత దానయ్య అంగీకరించారని తెలిసింది. సినిమా ఫ్లాప్ కావడంతో తన పారితోషికం లో ఐదు కోట్లు వెనక్కి ఇస్తానని హీరో రామ్ చరణ్ నిర్మాతకు ప్రామిస్ చేశాడట. ఇదే విషయాన్ని దర్శకుడు బోయపాటి కి చెప్పిన దానయ్య, అతని పారితోషికంలో 5 కోట్లు వెనక్కి ఇవ్వమని అడిగారట. అందుకు బోయపాటి అంగీకరించలేదని, నిర్మాతతో గొడవపడ్డారని ఇండస్ట్రీ టాక్. ఒకటి లేదా రెండు కోట్లు వెనక్కి ఇవ్వడానికి మాత్రమే బోయపాటి సుముఖంగా ఉన్నారట. ఇద్దరి మధ్య ఈ విషయంలో మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది. ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకొని ఫైట్ చేసుకునే సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఆపారట. ప్రస్తుతం ఈ పంచాయతీ దిల్ రాజు వద్దకు చేరిందని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
