బ్రేకింగ్: 'బ‌్లాక్ పాంథర్' యాక్టర్ చాడ్విక్ బోస్మన్ మృతి
on Aug 28, 2020

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ హాలీవుడ్ స్టార్ యాక్టర్ చాడ్విక్ బోస్మన్ 43 ఏళ్ల పిన్న వయసులో మృతి చెందాడు. 'బ్లాక్ పాంథర్' క్యారెక్టర్‌తో బోస్మన్ ఆబాల గోపాలాన్నీ అలరిస్తూ వచ్చాడు. నాలుగేళ్ల క్రితం అతనికి పెద్ద ప్రేగు కేన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఎప్పుడూ ఆ విషయాన్ని అతను బహిర్గతం చెయ్యలేదని వారు చెప్పారు.
"చాడ్విక్ పోరాట యోధుడు. ఇంతకాలం పట్టుదలతో పోరాడుతూ వచ్చాడు. మీరు ఎంతగానో ప్రేమించిన సినిమాలను మీ ముందుకు తీసుకు వచ్చాడు. లెక్కలేనన్ని సర్జరీలు, కీమోథెరపీల మధ్య మార్షల్, బ్లాక్ పాంథర్, అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్, 21 బ్రిడ్జెస్, డా 5 బ్లడ్స్, మా రైనీస్ బ్లాక్ బాటమ్ వంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. అతని కెరీర్‌లో కింగ్ టి చల్లా అలియాస్ బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ చెయ్యడం తనకు దక్కిన గౌరవంగా భావించాడు." అని ఓ ప్రకటనలో కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తొలిసారిగా బ్లాక్ పాంథర్ క్యారెక్టర్‌ను 2016లో వచ్చిన 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్' మూవీలో పోషించాడు చాడ్విక్. అందులో అతడిది సపోర్టింగ్ క్యారెక్టర్. ఆ తర్వాత 2018లో వచ్చిన 'బ్లాక్ పాంథర్' మూవీలో టైటిల్ రోల్ చేశాడు. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.347 బిలియన్ డాలర్లను వసూలుచేసి చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్‌గా నామినేషన్ పొందిన తొలి మార్వెల్ మూవీ అదే కావడం విశేషం. ప్రస్తుతం అతడితో 'బ్లాక్ పాంథర్ 2'ను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అతడు కేన్సర్‌కు లొంగిపోయి మృతి చెందాడు. అతడి మరణంతో అశేష అభిమానుల గుండెలు పగిలాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



