ప్రఖ్యాత దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా ఇక లేరు!
on Jun 10, 2021

జాతీయ అవార్డు గ్రహీత, భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించి పెట్టిన దర్శకుల్లో ఒకరైన బుద్ధదేవ్ దాస్‌గుప్తా నేటి ఉదయం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో ఇబ్బందులు పడుతున్న ఆయన రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఆయన మృతి బెంగాలీ చిత్రపరిశ్రమకు గ్రేట్ లాస్‌గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు.
1980, 1990ల కాలంలో బెంగాల్‌లో సమాంతర సినిమా ఉద్యమాన్ని గౌతమ్ ఘోష్, అపర్ణా సేన్‌లతో పాటు బుద్ధదేవ్ దాస్‌గుప్తా నడిపారు. మెయిన్ స్ట్రీమ్ యాక్టర్లకు ఆయనతో సినిమా చేస్తే నేషనల్ అవార్డ్ గ్యారంటీ అనే అభిప్రాయం ఏర్పడిందంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. మొదట్లో ఆయన రూపొందించిన సినిమాలు 'దూరత్వ' (1978), 'గృహజుద్ధ' (1982), 'ఆంధీ గలీ' (1984) బెంగాల్‌లోని నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందాయి. బెంగాలీలో సామూహిక చైతన్యం ఎలా రూపుదాల్చిందో కూడా ఈ సినిమాలు చూపించాయి.
ఆయన తీసిన చిత్రాల్లో ఐదింటికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అభించింది. ఆ సినిమాలు.. 'బాఘ్ బహదూర్' (1989), 'చరాచర్' (1993), 'లాల్ దర్జా' (1997), 'మోండో మేయర్ ఉపఖ్యాన్' (2002), 'కాల్‌పురుష్' (2008). అలాగే 'దూరత్వ' (1978), 'తహదేర్ కథ' (1993) ఉత్తమ బెంగాలీ చిత్రాలుగా నేషనల్ అవార్డ్ పొందాయి. 'ఉత్తర' (2000), 'స్వప్నేర్ దిన్' (2005) చిత్రాలకు గాను బెస్ట్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డులు పొందారు బుద్ధదేవ్.

ఆయన సినిమా దర్శకుడు మాత్రమే కాదు, పేరుపొందిన కవి కూడా. సూట్‌కేట్, హిమ్‌జోగ్, గోవిర్ అరలే, కాఫిన్ కింబా, ఛాత కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ఠ కవిత, భోంబోలర్ ఆశ్చర్య కహిని ఓ అనన్య కవిత లాంటి సంపుటాలు ఆయన వెలువరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



