బర్త్ డే స్పెషల్: ఒకే ఏడాదిలో బాలయ్య ఆరు వరుస విజయాలు!
on Jun 10, 2021

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పలు రికార్డులున్నాయి. వాటిలో అత్యంత అరుదైన రికార్డు ఒకటుంది. అదేమిటంటే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఆరు వరుస విజయాలు అందుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టడం.
ఆ వివరాల్లోకి వెళితే.. 1986లో బాలయ్య హీరోగా 7 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలే.. `నిప్పులాంటి మనిషి`, `ముద్దుల కృష్ణయ్య`, `సీతారామ కళ్యాణం`, `అనసూయమ్మ గారి అల్లుడు`, `దేశోద్ధారకుడు`, `కలియుగ కృష్ణుడు`, `అపూర్వ సహోదరులు`. వీటిలో మొదటి సినిమా అయిన `నిప్పులాంటి మనిషి` నిరాశపరచగా.. ఆ తరువాత వచ్చిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. బాలయ్యని `బాక్సాఫీస్ బొనాంజా`ని చేశాయి. విశేషమేమిటంటే.. ఈ సినిమాలన్నింటిని కూడా వేర్వేరు దర్శకులు తెరకెక్కించారు.
1986 ఫిబ్రవరి 7న విడుదలైన `నిప్పులాంటి మనిషి`ని ఎన్. బి. చక్రవర్తి రూపొందించగా.. ఫిబ్రవరి 28న జనం ముందుకొచ్చిన `ముద్దుల కృష్ణయ్య`ని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న సందడి చేసిన `సీతారామ కళ్యాణం`ని జంధ్యాల డైరెక్ట్ చేయగా.. జూలై 2న రిలీజైన `అనసూయమ్మ గారి అల్లుడు`కి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఆగస్టు 7న థియేటర్స్ లోకి వచ్చిన `దేశోద్ధారకుడు`ని ఎస్. ఎస్. రవిచంద్ర తెరకెక్కించగా.. సెప్టెంబర్ 19న విడుదలైన `కలియుగ కృష్ణుడు`కి కె. మురళీమోహనరావు కెప్టెన్. అలాగే ఆ ఏడాదిలో బాలయ్య చివరి సినిమా అయిన `అపూర్వ సహోదరులు`కి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
ఇలా.. విభిన్న దర్శకుల కాంబినేషన్స్ లో బాలయ్య నటించిన ఈ ఏడు చిత్రాల్లో ఆరు `అఖండ` విజయాలు సాధించి.. 1986ని కాస్త `బాలయ్య నామ సంవత్సరం`గా మార్చాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనదగ్గ రికార్డుని అందించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



