కంప్లీట్ మూవీ రివ్యూ : ' ఎటాక్ '
on Apr 1, 2016
.jpg)
హమ్మయ్య వర్మ ఏం మారలేదు! మళ్లీ అదే.. సినిమా.. మళ్లీ అదే వర్మ!
వర్మ సినిమా నుంచి ఏం ఆశిస్తామో.. అవన్నీ 'ఎటాక్'లో పుష్కలంగా ఉన్నాయి. కావల్సినదానికంటే ఎక్కువే వడ్డించాడు. అమ్మబాబోయ్.. ఇక నావల్ల కాదు.. అన్నంత వరకూ వదలనే వదల్లేదు.
ఇంతకీ వర్మ సినిమా అంటే ఏమిటో, ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా.
వర్మ సినిమాల్లో కథ ఉండదులే అని ముందే అనేసుకొని థియేటర్లోకి అడుగుపెడితే...
మన అంచనాల్ని 200 శాతం నిజం చేశాడు వర్మ.
వర్మ సినిమాలో పెద్దగా మేటర్ కూడా ఉండి ఉండదు అని అనుకొంటే...
ఆ మేటర్ అనే మీటర్‌కి వేల కీలో మీటర్ల దూరంలో నిలబడి పోయి మన ఆశల్ని నిజం చేశాడు వర్మ.
వర్మ ఎందుకు సినిమా తీస్తాడో తనకే తెలీదు అని మనం నమ్మితే..
మన నమ్మకాన్ని గుడి ముందు ధ్వజ స్థంభం నిలబెట్టినట్టు ఈసారీ నిలబెట్టేశాడు వర్మ.
ఇదీ వర్మ చేసిన ఎటాక్ సినిమా.. ప్రేక్షకులపై కనికరం లేకుండా నిర్దాక్ష్యణ్యంగా వర్మ ఎటాక్ చేసిన విధానం ఇంకెలా ఉందో తెలుసుకోవాలంటే ఇంకాస్త డిటైల్స్ లోకి వెళ్లాల్సిందే.
ఇంతకీ కథేంటంటే.. 'ఎటాక్' తప్ప ఏం లేదు.
సినిమాలో ఏం ఉన్నా, లేకున్నా టైటిల్‌కి మాత్రం జస్టిఫికేషన్ చేయాల్సిందే అని వర్మ గట్టిగా ఫీలై ఉంటాడు. అందుకే సినిమా మొత్తం ఎటాక్‌లపై ఎటాక్‌లతో నింపేశాడు. ముందు ప్రకాష్‌రాజ్‌పై ఎటాక్ జరుగుతుంది. ఆ తరవాత ప్రకాష్‌రాజ్ అనుచరులపై ఎటాక్ జరుగుతుంది. ఆ తరవాత జగపతిబాబుపై ఎటాక్ జరుగుతుంది. అక్కడ్నుంచి మంచు మనోజ్ ఎటాక్‌లు చేయడం మొదలెడతారు. ఎక్కడ చూసినా ఎటాక్.. ఎటాక్. మనకేమో హార్టెటాక్...!! చంపినవాళ్లని చంపడమే న్యాయం అనే అంశం చుట్టూ గుడ్డిగా ఫాలో అయిపోయిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలతో రాంగోపాల్ వర్మ జనాలకు ఏం చెప్పాలనుకొన్నాడు? ఏం చూపించాలనుకొంటున్నాడు? ఆ పాత్రలేంటి? ఆ సంభాషణలేంటి? అసలు వర్మ స్ర్కీన్ ప్లే ఏంటి??
వర్మకు ఆడవాళ్లంటే సెక్సీ సింబల్స్. అంతకు మించి వాళ్లలో ఏం చూశాడు గనుక. ఈ సినిమాలో పూనమ్ కౌర్ పాత్ర తీర్చిదిద్దిన విధానం చూస్తే...జనానికి వర్మపై కోపం రాక మానదు. పూనమ్‌ని ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో చూళ్లేదు. విలన్ అభిమన్యుసింగ్ కంటే.. క్రూరంగా ఉంటుందా పాత్ర. అభిమన్యుసింగ్‌ని తరవాత చంపుదువు గానీ... ముందు పూనమ్‌ని చంపేస్తే ఓ పీడా వదిలిపోతుంది.. అని ప్రేక్షకుడే అనుకొనేటట్టు ఆ పాత్రని డిజైన్ చేశాడంటే వర్మని ఏం అనుకోవాలి. ప్రకాష్‌రాజ్ ఫస్ట్ సీన్‌లోనే చనిపోతాడు. కానీ చీటికి మాటికి ప్రకాష్‌రాజ్ తెరపై కనిపిస్తూనే ఉంటాడు. అదీ ఫ్లాష్ బ్యాక్ ల రూపంలో. కెమెరా వంక చూస్తూ.. ప్రకాష్‌రాజ్ కృతకంగా చెప్పే డైలాగులు వింటే నవ్వొస్తుంటుంది. ఈ సినిమాలో ఎవరికి ప్రకాష్‌రాజ్ గుర్తొచ్చినా.. ఆయన టంచనుగా కెమెరాముందుకు వచ్చేస్తాడు. స్ర్కీన్ ప్లేలో ఇదో కొత్త ట్రిక్కేమో..! టీవీల్లో చూపించే క్రైమ్ ఎపిసోడ్సే దీనికంటే బెటర్‌గా ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఓ క్రైమ్ కథని ఏమాత్రం ఆసక్తి లేకుండా.. సాదా సీదాగా తీసేశాడు వర్మ. దానికి మహాభారతం నుంచి స్ఫూర్తి పొందినట్టు బిల్డప్పొకటి.
నటీనటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే వాళ్లంతా వర్మని గుడ్డిగా ఫాలో అయిపోయినవాళ్లే. మంచు మనోజ్ ఈ సినిమా మొత్తం సీరియస్‌గానే కనిపిస్తాడు. దానికి తోడు గడ్డం, మీసకట్టు.. ఏమాత్రం మ్యాచ్ కాలేదు. మనోజ్ అర్జెంటుగా ఒళ్లు తగ్గాలి. సురభికి ఈ సినిమాలో అంత సీన్ లేదు. ప్రకాష్‌రాజ్ ది ఓవర్ యాక్టింగే అన్న విషయం ఈ సినిమా మరోసారి నిరూపించింది. జగపతిబాబుది చిన్న రోలే. వడ్డే నవీన్ పాత్ర తీరుతెన్నులు కూడా అంతంత మాత్రమే.
ఎటాక్ సినిమా పోస్టరు, ట్రైలర్ చూసి.. ఇది రొటీన్ రొడ్డకొట్టుడే అని ప్రేక్షకుడు ఫీలై ఉంటే.. దాన్ని తు.చ తప్పకుండా నిజం చేయడానికి వర్మ తీసిన మరో అద్భుత కళాఖండం ఇది. సడన్‌గా మంచి సినిమా తీసేస్తే జనాలకు హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందేమో అని కంగారు పడి. అలాంటి ఇబ్బందిలేం లేకుండా వర్మ ఎప్పట్లా ఓ విషయంలేని సినిమా తీశాడు.
చివరిగా : ప్రేక్షకులపై వర్మ చేసిన 'ఎటాక్' ఇది
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



