అభిమానుల్ని నిరాశపరచని రామ్ గోపాల్ వర్మ..!
on Apr 1, 2016

వర్మ గారంటే అందరికీ అభిమానమే. ఆయన సినిమాలు చూసే వాళ్లకు, ఆయనతో సినిమాలు చేసేవాళ్లకు, మీడియాకు, ప్రజలకు..ఇలా అందరికీ అభిమానమే. గత కొన్నేళ్లుగా వర్మగారి స్టాండర్డ్ పెంచుకుంటూ పోతున్నారు. ట్వీట్స్ లోనైనా, సినిమాల్లోనైనా, ఆయన్ను దాటే వాళ్లు లేరు. సినిమాలైతే కొత్త స్టాండర్డ్ ను వర్మ గారు క్రియేట్ చేశారు. శివతో తెలుగు సినిమాలో కొత్త అధ్యయానికి తెరలేపిన వర్మ గారి టాలెంట్ అలాంటిలాంటిది కాదు. కానీ ఒక్కోసారి హెవీ టాలెంట్ కూడా భయం కలిగిస్తుంది. అందుకే తన టాలెంట్ తో థియేటర్లకు వచ్చేవాళ్లని భయపెడదామని దెయ్యం సినిమాలు కూడా చాలానే తీశారు. సినిమాలో దెయ్యాన్ని చూసి భయపడకపోయినా, ఆ సినిమాలు చూసి భయపడ్డారు తెలుగు జనాలు.

దెయ్యమో, సినిమానో..మొత్తమ్మీద భయపెట్టడంలో అయితే సక్సెస్ అయ్యారు వర్మ గారు. అందుకే ఆయన సినిమాలంటే, ఆడియన్స్ లో ఒక ఎక్స్ పెక్టేషన్స్ వచ్చేశాయి. ఏదో ఈ మధ్య అక్కడక్కడా అనుకోకుండా రక్త చరిత్ర, రౌడీ, కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు వచ్చి ఆయన రేంజ్ ను తగ్గించేసినా, ఇదేంటి వర్మగారు తన రేంజ్ సినిమాలు తీయట్లేదని జనాలు కంగారు పడినా, వర్మగారు మాత్రం తొట్రుపాటు పడలేదు. ఈ సారి నా రేంజ్ సినిమానే వస్తుంది చూడండి అని అటాక్ తో అటాక్ చేశారు. సినిమా చూసిన తర్వాత, ప్రేక్షకులందరూ, హమ్మయ్య..మనం కంగారు పడినట్లు వర్మ ఏమీ చేయలేదు, మనం ఎలాంటి సినిమా ఊహించామో, అలాంటి సినిమానే తీశాడులే అనుకుంటూ, ఆయన శైలిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బుర్రలకు పదును పెట్టే ప్రయత్నం చేస్తూ బయటికొస్తారు. అందులో మాత్రం ఎలాంటి సందేహమూ వలదు..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



