అర్జున్ Vs విష్వక్.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?
on Nov 8, 2022

యువనటుడు విష్వక్ సేన్ హీరోగా కొంత కాలం క్రితం యాక్షన్ కింగ్ అర్జున్ ఓ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఆ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. ఆ మూవీకి ఆయనే నిర్మాత, దర్శకుడు. మూవీ ఓపెనింగ్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి, ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న షెడ్యూల్ ప్రకారం అర్జున్ రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని అనుకున్నారు. విష్వక్‌కు సమాచారం అందించారు. అయితే షూటింగ్ ఆపమని, మరోసారి స్టోరీ డిస్కషన్ పెట్టుకొని ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్దామని అర్జున్‌కు మెసేజ్ పెట్టాడు విష్వక్. అలా ఒకసారి కాదు, రెండు సార్లు విష్వక్ వల్ల షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని అర్జున్ చెప్పారు. డిస్కషన్స్ కోసం తన జీవితంలో ఎవరికీ చేయనన్ని ఫోన్ కాల్స్ విష్వక్‌కు చేశాననీ, విష్వక్ తన కాల్స్ రిసీవ్ చేసుకోలేదనీ ఆయన అరోపించారు. విష్వక్ ప్రొఫెషనల్‌గా బిహేవ్ చెయ్యలేదని అన్నారు.
ఒకసారి నిర్ణయించిన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అవడం వల్ల నిర్మాతకు ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలుసు. విష్వక్‌కు తెలియకుండా ఉంటుందా? యాక్టర్ల కాల్షీట్లు తీసుకొన్నాక, షెడ్యూల్ క్యాన్సిల్ అయితే మళ్లీ వాళ్లందరి కాల్షీట్లు తీసుకోవాలి. అదివరకు తీసుకున్న కాల్షీట్లకు సంబంధించిన పారితోషికాన్ని నష్టపోవాలి. లొకేషన్ చార్జీల దగ్గర్నుంచి, అనేక ఇతర ఖర్చులు వృథా అవుతాయి. ఇదంతా నిర్మాతకు కలిగే నష్టం.
సరే.. అర్జున్ ఆరోపణలకు విష్వక్ ఇచ్చిన జవాబు ఏమిటో చూద్దాం. తను చాలా కమిటెడ్ అనీ, తనలోని ప్రొఫెషనలిజం శంకించలేనిదనీ విష్వక్ అన్నాడు. ఇంతదాకా తనవల్ల ఏ నిర్మాతా బాధపడలేదనీ, నష్టపోలేదనీ చెప్పాడు. తను స్క్రిప్టులో మార్పులు సూచిస్తే, అంతా తనకు వదిలెయ్యమనీ, "నన్ను నమ్ము" అంటూ అర్జున్ ఏం చెప్పనిచ్చేవాళ్లు కాదనీ అన్నాడు. ఒకవేళ తను షూటింగ్‌కు వెళ్తే ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే ఎలా వుంటుందో, అలా ఉంటుందన్నాడు. మరోసారి షూటింగ్‌కు వెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు షూటింగ్ ఆపమని మెసేజ్ పెట్టడం తన తప్పేనని ఒప్పుకున్నాడు. సినిమా నుంచి తప్పుకుంటానని మాత్రం ఆయనకు చెప్పలేదన్నాడు. "నావల్ల మీరు ఇబ్బంది పడివుంటే క్షమించండి అర్జున్ సార్" అని అన్నాడు.
అర్జున్ ఆరోపణలకు విష్వక్ రెస్పాన్స్ చూశాక.. చాలామంది విష్వక్‌నే వేలెత్తి చూపుతున్నారు. ఒకసారి కథవిని సినిమా చేస్తానని ఒప్పుకున్నాక, సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయి రెగ్యులర్ షూటింగ్ వేళకు స్క్రిప్టులో మార్పులు చెయ్యమని అర్జున్‌కు సూచించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సినిమా ఒప్పుకోక ముందే స్క్రిప్టులో మార్పులు సూచించడం వేరు, ఒప్పుకున్నాక మార్పులు చెప్పడం వేరు.. ఇక్కడ అర్జున్ స్వయానా డైరెక్టర్. ఆయనే ఈ సినిమా క్రియేటర్. నాలుగు దశాబ్దాల కాలం పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగమైన వ్యక్తి. ఆయనకు ముందుగానే తన ఆలోచనలు చెబితే, అవి ఆయనకు నచ్చితే చేస్తారు, లేదంటే ఇంకో యాక్టర్‌ని తీసుకుంటారు. షూటింగ్‌కు రెడీ అయ్యాక ఇలా చెయ్యడం విష్వక్‌లోని ఓవర్ యాటిట్యూడ్‌కు నిదర్శనమని ఇండస్ట్రీ వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.
విష్వక్ హీరోగా నటించిన 'ఫలక్‌నుమా దాస్' సినిమా నుంచి, అతని మాటలు కానీ, చేష్టలు కానీ.. అతని యాటిట్యూడ్‌ను తెలియజేస్తాయని, ఆత్మాభిమానం పేరిట అతను ఆ యాటిట్యూడ్‌ను సమర్థించుకుంటూ వస్తున్నాడని కొంతమంది అంటున్నారు. ఇప్పటికే తన ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న విష్వక్.. మునుముందు తన ధోరణిని మార్చుకోకపోతే కెరీర్ పరంగా ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



