వన్ సైడ్ లవర్ `ఆర్య`కి 17 ఏళ్ళు!
on May 7, 2021
`వన్ సైడ్ లవ్` అనే కాన్సెప్ట్ తో తెలుగు కుర్రకారుని ఫిదా చేసిన చిత్రం `ఆర్య`. `ఫీల్ మై లవ్` అంటూ వన్ సైడ్ లవర్ `ఆర్య` చేసిన సందడికి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిసి.. నేటికి సరిగ్గా 17 ఏళ్ళు.
2004 మే 7న విడుదలై అఖండ విజయం సాధించిన ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ముచ్చటించుకుంటే..
* మొదటి సినిమా `గంగోత్రి`తోనే సూపర్ హిట్ అందుకున్నప్పటికీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లోని సిసలైన నటుడ్ని పరిచయం చేసింది మాత్రం `ఆర్య` అనే చెప్పాలి. కేవలం యాక్టింగ్ తోనే కాదు డాన్స్ లతోనూ, స్టంట్స్ తోనూ యువతరాన్ని విశేషంగా అలరించారు బన్ని. తనలో ఎంత ఈజ్ ఉందో చెప్పకనే చెప్పారు.
* బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రమిది. తెలుగునాట అప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా.. `ఆర్య`ని తెరకెక్కించి ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి అదే శైలిలో ముందుకు సాగుతూ సృజనాత్మక దర్శకుడిగా పేరు పొందారు సుక్కు.
* `దిల్`తో నిర్మాణరంగంలో అడుగుపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు.. రెండో ప్రయత్నమైన `ఆర్య`తోనూ ఘనవిజయం అందుకున్నారు. ఈ సినిమాతోనే కొత్త దర్శకులకు తొలి అవకాశం ఇవ్వడం అనే ఘట్టానికి శ్రీకారం చుట్టారు రాజు.
* రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని యువతరానికి మరింత చేరువ చేసిన సినిమా ఇది. ``ఫీల్ మై లవ్``, ``నువ్వుంటే`` అంటూ సాగే మెలోడీలతోనూ.. ``అ అంటే అమలాపురం`` అంటూ సాగే మాస్ డ్యాన్స్ నంబర్ తోనూ మెస్మరైజ్ చేశారు డీఎస్పీ. అలాగే `యూ రాక్ మై వరల్డ్``, ``తకథిమితోం``, ``ఓ మై బ్రదర్`` వంటి పాటలు కూడా అలరించాయి. నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు దేవిశ్రీ ప్రసాద్.
Also Read