పవన్‌ని వదిలేసి బన్నీని పట్టాడా?
on Dec 30, 2022

టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకునిగా సురేందర్ రెడ్డి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కళ్యాణ్ రామ్ నందమూరి అవకాశం ఇవ్వడంతో అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై పెద్ద హిట్టును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్‌కు కూడా ఎంతో ఊరటనిచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ అశోక్, మహేష్ బాబు అతిధి.... సరిగా ఆడలేదు. ఇదే సమయంలో ఆయన రవితేజ తో కిక్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లిలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ విభిన్న చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ సరైన కమర్షియల్ హిట్‌ను సాధించలేకపోయింది. మరలా అల్లు అర్జున్‌తో రేస్ గుర్రం తీసి పట్టాలెక్కాడు. ఇంకా ఆ వెంటనే రవితేజ తో కిక్ 2, రామ్ చరణ్ తో ధ్రువ తీసి మెప్పించారు. దీంతో మెగాస్టార్ పిలిచి మరీ ఆయనకు హిస్టారికల్ మూవీగా తన జీవితంలో ఎప్పుడో అప్పుడు చేయాలని భావించిన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమాను సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారు. ఈ చిత్రం బాగానే ఆడింది. కాకపోతే పాన్ ఇండియా రేంజ్ లో మాత్రం సరైన గుర్తింపును తెచ్చుకోలేకపోయింది.
ప్రస్తుతం ఆయన అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే యాక్షన్ మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంపై అక్కినేని అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. పక్కా హాలీవుడ్ యాక్షన్ హీరోలాగా అఖిల్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఈ చిత్రాన్ని జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో నటించడానికి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకునిగా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం ఉంటుందని చెప్పినప్పటికీ అది పట్టాలక్కేలా కనిపించడం లేదు. పవన్ పాలిటిక్స్‌తో పాటు సినిమాల పరంగా పలు కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా ఆలస్యం అయ్యేలా ఉంది.
దీంతో సురేందర్ రెడ్డి ఇటీవల బన్నీని కలిసి ఓ స్టోరీ చెప్పారని సమాచారం. అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా పుష్ప చిత్రాకే సమయం కేటాయించారు. ఇప్పటికే పుష్ప మొదటి భాగం ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ మొదలుపెట్టారు. ఐదు రోజులు షూటింగ్ జరిపి మరలా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని అందులో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది చివరకు గాని పూర్తికాదని 2024 లోనే పుష్పా2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తదుపరి చిత్రం దర్శకుడు ఎవరు? అనే విషయంలో పలు పేర్లు చర్చకు వచ్చాయి. చాలా పేర్ల ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ వారు ఎవరు కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ తనకు రేసుగుర్రం వంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన్న సురేందర్ రెడ్డి తో మరో యాక్షన్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్ ను చేయాలని నిర్ణయించుకున్నారట. సురేందర్ రెడ్డి ఇప్పటికే బన్నీకి కథ చెప్పడం బన్నీ ఓకే చేయడం జరిగిపోయిందని సమాచారం. రేసుగుర్రం వంటి కమర్షియల్ సబ్జెక్టును ఇప్పటికే రెడీ చేసి వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి పుష్ప2 తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి పుష్ప1, పుష్ప2ల తరువాత అల్లు అర్జున్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. మరి సురేందర్ రెడ్డి చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుందా? లేదా? సైరా మూవీ పాన్ ఇండియా లెవల్లో మెప్పించలేకపోయిన తరుణంలో బన్నీ- సూరిల చిత్రం కేవలం తెలుగుకి మాత్రమే పరితమవుతుందా? అనేది వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



