అఖిల్ ఎదురుచూపులకు ఇకనైనా తెరపడుతుందా..?!
on Dec 30, 2022

అక్కినేని ఫ్యామిలీ అంటే రొమాంటిక్ హీరోలకు ప్రసిద్ధి. అక్కినేని నాగేశ్వరరావు ట్రాజడీ కింగ్ గా,రొమాంటిక్ హీరోగా ఓ వెలుగు వెలిగిపోయారు. ఆయన నటించిన దేవదాసు చిత్రం చూసి అదే చిత్రాన్ని ఇతర భాషల్లో చేసిన వారు సైతం ఇంత గొప్పగా మేము చేయలేదే అని అక్కినేని పై నాడు ప్రశంసల వర్షం కురిపించారట. అదే కోవలో ఆయన ఎన్నో మరుపురాని, మరిచిపోలేని అద్భుతమైన కళాఖండాలలో నటించారు.
ఇక ఆయన కుమారుడైన అక్కినేని నాగార్జున సైతం మాస్ కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ ఆయనకు కూడా రొమాంటిక్ ఇమేజ్ ఉండేది. శివ వంటి యాక్షన్ మూవీతో సంచలనం సృష్టించిన ఆయనకు గీతాంజలి చిత్రం లేడీస్ ఫాలోయింగ్‌ని తీసుకొని వచ్చింది. లేడీస్ లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరిచిన చిత్రంతోపాటు మజ్ను, జానకి రాముడు, నిర్ణయం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, నిన్నే పెళ్ళాడుతా, చంద్రలేఖ, నువ్వు వస్తావని, రావోయి చందమామ, నిన్నే ప్రేమిస్తా, సంతోషం, మన్మధుడు, మనం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన, దేవదాస్, బంగార్రాజు వంటివన్నీ మహిళలను విపరీతంగా కట్టుకున్నాయి.
ఆ తర్వాత వచ్చిన ఆయన పెద్ద కుమారుడైన నాగచైతన్య సైతం యాక్షన్ హీరో అవుదామని మొదటి మూవీగా జోష్ చిత్రంలో నటించినా కూడా ఆయనకు కూడా రొమాంటిక్ ఇమేజ్ రావడంతో అతను కూడా రొమాంటిక్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఏ మాయ చేశావే, 100%లవ్, మనం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలి, వెంకీ మామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు చిత్రాలు ఈయనకు లేడీ, ఫ్యామిలీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. కానీ నాగార్జున చిన్నబ్బాయి అఖిల్ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంది. అక్కినేని అఖిలు మొదట్లో తాను రొమాంటిక్ ఇమేజ్ ని కాకుండా యాక్షన్ ఇమేజ్ ని కోరుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఆయన మొదటి చిత్రం అఖిల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది.
కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలను చేశారు. మిస్టర్ మజ్నుకు వెంకి అట్లూరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు బొమ్మరిల్లు భాస్కర్ వంటి వారు దర్శకత్వం వహించారు. వీరందరిలో వినాయక్ తప్పించి మిగిలిన ముగ్గురు అంటే విక్రమ్ కుమార్, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్లు రొమాంటిక్ సినిమాలను, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను బాగా తీస్తారనే పేరు ఉన్న వారే. వీటిల్లో ఆయనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రమే ఊరటనిచ్చింది. కానీ మిగిలిన చిత్రాలేవీ అఖిల్ కు హిట్టును ఇవ్వలేకపోయాయి.
కాగా ప్రస్తుతం అఖిల్ మరోసారి యాక్షన్ హీరోగా అవతారం ఎత్తుతున్నారు. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదల కాబోతుండడంతో ఏజెంట్ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాకా ఈ సినిమా కొత్త విడుదల తేదీ సంక్రాంతి సీజన్ తర్వాత గాని ఫిబ్రవరిలో గాని ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాలకు ఫిబ్రవరిని, సంక్రాంతి ముగిసిన తర్వాత మార్చి వరకు అన్సీజన్ అనే ఫీలింగ్ మేకర్స్‌కు హీరోలకు ఉంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత అన్ సీజన్ మొదలవుతుంది. కానీ గతంలో ఇలాంటి సీజన్లోనే విడుదలై చాలా సినిమాలు హిట్లు కొట్టాయి. వాటిల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి చిత్రాన్ని ఉదాహరణగా చెప్పాలి. ఈ సినిమా ఆ సెంటిమెంటును తిరగరాసింది.
మరి ఈసారి అఖిల్ కూడా ఏజెంట్ మీద ఈ చిత్రం కంటెంట్ పై నమ్మకంతో దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్ అద్భుతంగా చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో కీలకపాత్రను మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తుండగా హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. అఖిల్ కు లుక్కి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. అఖిల్ హాలీవుడ్ హీరోల రేంజ్‌లో బాడీ బిల్డింగ్ చేసి కనిపిస్తున్నాడు. చిత్రం విడుదలపై మరింత స్పష్టమైన అవగాహన ఒకటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉందని జనవరి ఒకటో తారీకు న్యూ ఇయర్ సందర్భంగా విడుదల తేదీ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి... మరి వీటిలో నిజం ఎంతో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



