30లోకి బాలయ్య `రౌడీ ఇన్స్ పెక్టర్`
on May 7, 2021
తెలుగునాట పవర్ ఫుల్ కాప్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన పోలీసాఫీసర్ పాత్రలో నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. వాటిలో `రౌడీ ఇన్స్ పెక్టర్` ఒకటి. `లారీ డ్రైవర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్ లో బాలయ్య చేసిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. బాలయ్యకి జంటగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ఈ యాక్షన్ డ్రామాలో హరీశ్, జగ్గయ్య, కెప్టెన్ రాజు, మోహన్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, నూతన్ ప్రసాద్, సాయికుమార్, శ్రీహరి, కిన్నెర, హేమ, అన్నపూర్ణ, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
బప్పీలహరి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``డిక్కీ డిక్కీ``, ``అరె వో సాంబ``, `టక్కుటమార బండి``, ``నీలాల నింగి``, ``చిటపట చినుకులు``, ``ఓ పాపాయో``.. ఇలా ప్రతీ గీతం మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1992 మే 7న విడుదలై ఘనవిజయం సాధించిన `రౌడీ ఇన్స్ పెక్టర్`.. నేటితో 29 వసంతాలను పూర్తిచేసుకుని 30లోకి అడుగుపెట్టింది.