'కాంతార' సినిమా 'పుష్ప'లా సూపర్ హిట్ అవుతుంది!
on Oct 12, 2022

'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో సంచలనం సృష్టించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన తాజా చిత్రం 'కాంతార'. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
'కాంతార' సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని 'గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా రిలీజ్ చేయనున్నారు. 'కాంతార' అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 15న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "హోంబలే ఫిల్మ్ సంస్థ కథలు ఎన్నుకుని, బ్రహ్మండంగా తీసే విధానం చూస్తుంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు ఈ 'కాంతార' సినిమా చూసిన తరువాత వారి దగ్గర కొంత నేర్చుకోవాలి అనిపిస్తుంది. డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి 'కాంతార' కచ్చితంగా నచ్చుతుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'పుష్ప' సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో ఫుల్ గా తీయడమే కాకుండా విష్ణు తాత్వాన్ని కూడా బ్యాగ్రౌండ్ గా పెట్టుకొని చెప్పడం జరిగింది. ఇటువంటి బ్యాగ్రౌండ్ లో వచ్చిన సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా ఇందులో అద్భుతంగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ డి గ్లామర్ రోల్ లో చాలా బాగా చేసింది. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మా గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 15న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. "తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్రస్థానంలో ఉంది. ఫారెస్ట్ మిస్టరీ కథ తో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. యూనివర్శల్ కథతో వస్తున్న 'కాంతార' సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కచ్చితంగా చెప్పగలను. ఇంతకు ముందు నేను నటించిన 'బెల్ బాటం' సినిమా ఆహా లో రిలీజై తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. మళ్ళీ అల్లు అరవింద్ గారే 'గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా 'కాంతార'ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను" అన్నారు.
హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ.. "ఈ నెల 15 న తెలుగులో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.
లిరిసిస్ట్ రాంబాబు గోశాల మాట్లాడుతూ.. " ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. దీంట్లో ఉండే ఆరు పాటలు రాసే అవకాశం ఇచ్చిన హనుమాన్ గారికి ధన్యవాదాలు. హీరో రిషబ్ శెట్టి కి రెండు సినిమాలు రాశాను ఇది మూడవ సినిమా. ఈ సినిమాను అల్లు అరవింద్ గారు రిలీజ్ చేస్తున్నారు అంటే భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగులో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



