ఇటు నవ్వుల వర్షం, అటు వసూళ్ల వర్షం కురిపించిన 'సుడిగాడు'కు పదేళ్లు!
on Aug 24, 2022

అల్లరి నరేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా 'సుడిగాడు'. తమిళంలో శివ హీరోగా నటించగా సి.ఎస్. అముదన్ డైరెక్ట్ చేసిన హిట్ ఫిల్మ్ 'తమిళ్ పాదమ్'కు రీమేక్ అయిన ఈ మూవీని సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. ఆమధ్య బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన మోనాల్ గజ్జర్ ఈ సినిమాతోటే టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. అరుంధతి మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్ డి. రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ఆడియెన్స్‌ను అలరించాడు. తండ్రి జోడీగా హేమ నటించడం ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషం.
పుట్టడమే సిక్స్ ప్యాక్ బాడీతో పుట్టి, తన మూత్రవిసర్జనతో విలన్ తిక్కల్‌రెడ్డి (జయప్రకాశ్‌రెడ్డి) పెద్దకొడుకు చనిపోవడానికి కారణమైన శివ (అల్లరి నరేశ్) కథగా 'సుడిగాడు' సినిమా హిలేరియస్ కామెడీతో ఆద్యంతం మనల్ని నవ్వుల వర్షంలో ముంచెత్తుతుంది. తనమీద దూసుకొచ్చే బుల్లెట్లను గాల్లోనే ఆపగలిగే, కాలాన్ని సైతం సవాలు చేయగలిగే అజేయమైన శక్తులు మన సుడిగాడి సొంతం. అలాంటివాడు ప్రియ (మోనాల్ గజ్జర్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. చివరకు శివకు సంబంధించిన ఓ ట్విస్ట్ వచ్చి అందరూ షాకవుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, వాటిని సునాయాసంగా అధిగమించగలిగే 'సుడిగాడు'గా అల్లరి నరేశ్ నటన, అతని క్యారెక్టరైజేషన్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా మలిచాయి.
అప్పటి టాప్ మాస్ ఫిలిమ్స్‌పై మంచి టైమింగ్‌తో నరేశ్ చేసిన స్పూఫ్‌లు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. అలాగే టీవీ యాంకర్ ఓంకార్‌పై చేసిన స్పూఫ్ ఆడియెన్స్‌ను కుర్చీల్లోంచి ఎగిరెగిరి పడేలా నవ్వించింది. అందుకే 'ఒకే టికెట్‌పై 100 సినిమాలు' అనే ట్యాగ్‌లైన్‌ను ఈ సినిమాకు ఉపయోగించారు. అల్లరి నరేశ్ చేసే అల్లరికి తోడు జఫ్ఫారెడ్డిగా బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, శ్రీనివాసరెడ్డి లాంటి ప్రసిద్ధ హాస్యనటులు ఈ సినిమాకు మరింత ప్లస్‌గా మారి, సినిమా ఘన విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. శ్రీవసంత్ సంగీతం సమకూర్చగా అల్లరి నరేశ్‌పై తీసిన ఇంట్రడక్షన్ సాంగ్, నరేశ్, మోనాల్, రచనా మౌర్యపై తీసిన పబ్ సాంగ్ కూడా ఆడియెన్స్‌ను రంజింపజేశాయి.
తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమై 2012 ఆగస్ట్ 24న విడుదలైన 'సుడిగాడు' సినిమా నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ లాభాల పంట పండించి, అల్లరి నరేశ్‌ను కామెడీ స్టార్‌గా మార్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



