'ఇండియన్-2' మొదలైంది.. 'RC 15' పరిస్థితి?
on Aug 24, 2022

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో మొదలైన 'ఇండియన్-2'(భారతీయుడు-2) రెండేళ్ల క్రితం క్రేన్ ప్రమాదం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో అసలు ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు శంకర్ కూడా రామ్ చరణ్ మూవీ 'RC 15'తో బిజీ అయ్యాడు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా 'ఇండియన్-2' షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఇండియన్-2' నిర్మాణంలో తాజాగా రెడ్ జెయింట్ మూవీస్ కూడా భాగస్వామిగా వచ్చి చేరింది. ఈ మూవీ షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో మళ్ళీ ప్రారంభమైంది. ఇటీవల 'విక్రమ్' సినిమాతో తమిళ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకొని సంచలనం సృష్టించాడు కమల్. ఇండియన్(భారతీయుడు)కి సీక్వెల్ కావడం, పైగా ఇండస్ట్రీ హిట్ అందుకొని కమల్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఈ సినిమా మిగతా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే 'ఇండియన్-2' షూటింగ్ మళ్ళీ ప్రారంభం కావడంతో 'RC 15' ఆలస్యం కానుంది. ప్రస్తుతం 'RC 15'ని పక్కన పెట్టి పూర్తిగా 'ఇండియన్-2' దృష్టి పెట్టనున్నాడు శంకర్. దీంతో 'RC 15' షూట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పటికీ పూర్తయ్యి విడుదలవుతుందోనని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



