అలీ 1111 సినిమా అబ్దుల్ కలాం బయోపిక్
on Feb 10, 2020

టాలీవుడ్‌లో సీనియర్ కమెడియన్ మహమ్మద్ అలీ అలియాస్ అలీ వెయ్యి సినిమాలు పూర్తిచేసిన అరుదైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన 'పీపుల్స్ ప్రెసిడెంట్'గా కీర్తి ప్రతిష్ఠలు పొందిన మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమాలో కలాం పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు 1111వ సినిమా కావడం గమనార్హం. 41 సంవత్సరాల క్రితం బాలనటునిగా కెరీర్ ఆరంభించిన ఆయన తెలుగు సహా పలు భారతీయ భాషా చిత్రాల్లో నటించి, కలాం బయోపిక్ ద్వారా హాలీవుడ్‌లోనూ కాలుమోపబోతున్నారు.
లాస్ ఏంజెల్స్ (యు.ఎస్.)కు చెందిన పింక్ జాగ్వార్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జాన్ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో నిర్మాణమయ్యే ఈ మూవీకి జగదీష్ దానేటి దర్శకుడు. అబ్దుల్ కలాం బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, కలాం గారి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హాలీవుడ్‌లో నటుడిగా అడుగు పెట్టే అవకాశమిచ్చిన దర్శకుడు జగదీష్‌కు రుణపడి ఉంటానన్నారు.
హాలీవుడ్ దిగ్గజం జాన్ మార్టిన్ మాట్లాడుతూ జగదీష్ దానేటిని కథల గనిగా అభివర్ణించారు. జగదీష్ చెప్పిన ఐదు కథలు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. జగదీష్ దానేటి మాట్లాడుతూ ఈ నెల 16 వరకు జరుపుతున్న భారత పర్యటనలో హాలీవుడ్, ఇండో అమెరికన్ ఫిల్మ్ ప్రాజెక్టులుగా నిర్మితమవుతున్న ఐదు చిత్రాల వివరాలను ప్రకటిస్తామన్నారు. అబ్దుల్ కలాం గారి బయోపిక్‌కు దర్శకత్వంవహించటం భారత కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసే బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



