జనవరి 6న 'అల.. వైకుంఠపురములో' ప్రి రిలీజ్ ఈవెంట్
on Dec 27, 2019

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్‌లో జరగనున్నది. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో టబు, జయరామ్, మురళీశర్మ, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, సచిన్ ఖేడ్‌కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రధారులు. తమన్ స్వరాలు కూర్చిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల్ని అమితంగా అలరిస్తున్నాయి. కాగా ఇదివరకు ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 5న విజాగ్‌లో జరుగుతుందనీ, దానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతాడనీ ప్రచారంలోకి వచ్చిన విషయం తిలిసిందే. అయితే తాజాగా ఆ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే జరపాలని నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్ణయించారు. వేదికను ఎంపికచేసే పనిలో ఉన్నారు.
'సరిలేరు నీకీవ్వరు' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరగనున్న విషయం, దానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్న విషయం మనకు తెలుసు. దానికి పోటీగా 'అల.. వైకుంఠపురములో' ఈవెంట్‌ను అదే రోజు వైజాగ్‌లో జరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ప్రచారానికి నిర్మాతలు తెరదించారు. జనవరి 6న జరిగే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి జూనియర్ ఎన్టీఆరేనా లేక మరెవరైనా వస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది. బిజినెస్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



