'మేజర్' డెసిషన్.. బడిపిల్లలకు సగం ధరకే సినిమా
on Jun 15, 2022

అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో అనేకమంది పౌరుల్ని ఒంటిచేత్తో కాపాడి, తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రాన్ని ఎక్కువ మంది పిల్లలకు చేరువచేసి, వారిలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. స్కూలు, కాలేజీ పిల్లలకు 50 శాతం టికెట్ ధరకే ఈ సినిమాని ప్రదర్శించాలనేది ఆ నిర్ణయం. ఏ స్కూలు యాజమాన్యమైనా, తమ స్కూలు పేరును రిజిస్టర్ చేసుకోవడం ద్వారా స్పెషల్ షో వేయించుకొనే అవకాశం పొందవచ్చు.
ఈ మేరకు ఓ వీడియోను నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో 'మేజర్' హీరో అడివి శేష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. "మేజర్ చిత్రానికి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కొన్ని రోజులుగా చాలామంది చిన్నారులు నాకు ఫోన్‌చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు. మేమూ మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని వారు చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పిల్లలకు ఇంత బాగా నచ్చుతుందని అనుకోలేదు. ఈ స్పందన చూసి మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఇంకొంతమంది పిల్లలు మేజర్ గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందాలని, గ్రూప్ టికెట్లపై స్కూల్స్‌కు రాయితీ కల్పిస్తున్నాం. రేపటి తరానికి మేజర్ సందీప్ గురించి తెలియాలనేదే మా లక్ష్యం" అని ఆయన చెప్పారు.
సోనీ పిక్చర్స్, ఎ ప్లస్ ఎస్‌తో కలిసి మహేశ్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'మేజర్' మూవీలో సాయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీశర్మ, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రధారులు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకునిగా పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



