ఇండస్ట్రీ హిట్ `పెదరాయుడు`కి 27 ఏళ్ళు!
on Jun 15, 2022

తెలుగునాట ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో రవిరాజా పినిశెట్టి ఒకరు. ఆయన తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్స్ లో `పెదరాయుడు` ఒకటి. తమిళ చిత్రం `నాట్టమై` (1994) (శరత్ కుమార్, మీనా, ఖుష్బూ)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో పెదరాయుడుగా, రాజాగా `కలెక్షన్ కింగ్` మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. పాపారాయుడుగా `సూపర్ స్టార్` రజినీకాంత్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు. మోహన్ బాబుకి జోడీగా భానుప్రియ, సౌందర్య అలరించిన ఈ చిత్రంలో రాజారవీంద్ర, శుభశ్రీ, ఆనంద్ రాజ్, జయంతి, బ్రహ్మానందం, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, బాబూ మోహన్, మాస్టర్ మహేంద్ర ముఖ్య పాత్రలోనూ, కైకాల సత్యనారాయణ అతిథి పాత్రలోనూ మెరిశారు. రవిరాజా పినిశెట్టి స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి జి. సత్యమూర్తి సంభాషణలు సమకూర్చారు.
కోటి స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ``కదిలే కాలమా`` ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలవగా.. ``బావవి నువ్వు``, ``అబ్బ దాని సోకు``, ``కూ అన్నదోయ్``, ``ఢమ ఢమ`` అంటూ మొదలయ్యే గీతాలు కూడా రంజింపజేశాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు స్వయంగా నిర్మించిన `పెదరాయుడు`.. `ఉత్తమ నటుడు`(మోహన్ బాబు) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని సొంతం చేసుకుంది. 1995 జూన్ 15న విడుదలై సంచలన విజయం సాధించిన `పెదరాయుడు`.. నేటితో 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



