'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన 'ఆచార్య'
on Jan 31, 2022

కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమాల విడుదల తేదీలు గందరగోళంగా మారాయి. మా సినిమా ఈ తేదీకి విడుదల కానుంది అంటూ మేకర్స్ ప్రకటిస్తున్నారు. కొద్దిరోజులకే విడుదల తేదీ మారిందంటూ మరో కొత్త తేదీని ప్రకటిస్తున్నారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న తమ సినిమాని విడుదల చేస్తామని ఇటీవల తెలిపిన 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ తాజాగా మార్చి 25 అంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 1 న విడుదల కావాల్సిన 'ఆచార్య' సినిమా వెనక్కి వెళ్ళింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 1 కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో మరోసారి ఆచార్య విడుదల తేదీ మారింది. ఆర్ఆర్ఆర్ మార్చి 25 న విడుదలవుతున్న నేపథ్యంలో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ సినిమాని ఏప్రిల్ 29 కి వాయిదా వేసినట్లు తాజాగా ఆచార్య టీమ్ ప్రకటించింది.

ఆచార్య వాయిదా పడిన నేపథ్యంలో 'సర్కారు వారి పాట' విడుదలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 'సర్కారు వారి పాట'ని ఏప్రిల్ 1 న విడుదల చేస్తామని గతంలో ఆ మూవీ టీమ్ ప్రకటించింది. అయితే ఇటీవల అదే డేట్ కి ఆచార్య రానుందని ప్రకటన రావడంతో ఆ సమయంలోనే సర్కారు వారి పాట సినిమా వాయిదా పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఏప్రిల్ 1 కి వారం ముందు విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ కోసం ఆచార్య వెనక్కి వెళ్ళడంతో 'సర్కారు వారి పాట' విడుదల తేదీ కూడా మారినట్లే అంటున్నారు.
మరోవైపు, 'ఆర్ఆర్ఆర్' కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 25 కి కష్టమే అని, ఏప్రిల్ 1 కి విడుదలయ్యే అవకాశముందని ఇటీవల న్యూస్ వినిపించింది. అదే జరిగితే, ఆర్ఆర్ఆర్ కారణంగా మరోసారి భీమ్లా నాయక్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



