ముగ్గురికీ కీలకమే.. యువ హీరోలు హిట్ కొట్టేనా?
on Sep 22, 2022

ఆగస్టు నెలలో 'బింబిసార', 'సీతా రామం', 'కార్తికేయ-2' రూపంలో బ్లాక్ బస్టర్స్ చూసిన తెలుగు సినీ పరిశ్రమకి సెప్టెంబర్ మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఈ నెలలో ఇప్పటిదాకా 'ఒకే ఒక జీవితం' మాత్రమే హిట్ గా నిలిచింది. గత వారం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', 'శాకిని డాకిని' వంటి సినిమాలు విడుదల కాగా, ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ వారం మరో మూడు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. రేపు(సెప్టెంబర్ 23) 'కృష్ణ వ్రింద విహారి', 'అల్లూరి', 'దొంగలున్నారు జాగ్రత్త' చిత్రాలు విడుదలవుతున్నాయి.
నాగ శౌర్య, షిర్లీ సేఠియా జంటగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో నాగ శౌర్య బ్రాహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. 2018లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'ఛలో' తర్వాత శౌర్య హీరోగా నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా అందులో ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయింది. 'వరుడు కావలెను' పర్లేదు అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలో వస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' మూవీ రిజల్ట్ శౌర్యకు కీలకం. మరి ఈ చిత్రం అతనికి 'ఛలో' రేంజ్ సక్సెస్ అందిస్తుందేమో చూద్దాం.
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు కెరీర్ ఒక హిట్, రెండు ఫ్లాప్ లు అన్నట్టుగా సాగుతోంది. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. కెరీర్ లో మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు 'అల్లూరి'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత చిత్రాలు 'అర్జున ఫల్గుణ', 'భళా తందనాన'తో నిరాశపరిచిన శ్రీవిష్ణు.. 'అల్లూరి'తో ఆకట్టుకుంటాడేమో చూడాలి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా 'మత్తు వదలరా'తో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. అయితే రెండో సినిమా 'తెల్లవారితే గురువారం'తో పరాజయం చూశాడు. ఇక ఇప్పుడు మూడో సినిమా 'దొంగలున్నారు జాగ్రత్త'తో అలరించడానికి సిద్ధమయ్యాడు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సింహా దొంగగా కనిపించనున్నాడు. కారు దొంగతనం చేయడానికెళ్లి, ఆ కారులోనే ఇరుక్కుపోయిన దొంగ ఎలా అవస్థలు పడ్డాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మిగతా కుర్ర హీరోల పోటీని తట్టుకొని నిలబడాలంటే సింహాకి ఈ మూవీ హిట్ అవ్వడం అవసరం.
మరి ఈ శుక్రవారం ఈ ముగ్గురు యువ హీరోలకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



