రేపు మూడు సినిమాల విడుదల.. ఈ ముగ్గురు బ్యూటీలకు సక్సెస్ దక్కేనా?
on Sep 15, 2022

ఆగస్టు నెల తెలుగు సినీ పరిశ్రమకి బాగానే కలిసొచ్చింది. 'బింబిసార', 'సీతా రామం', 'కార్తికేయ-2' రూపంలో బ్లాక్ బస్టర్స్ చూసింది. అయితే ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం ఇప్పటిదాకా 'ఒకే ఒక జీవితం' తప్ప మిగతా సినిమాలేవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. ఈ క్రమంలో రేపు(సెప్టెంబర్ 16న) విడుదలవుతున్న చిత్రాలపై ఆసక్తి నెలకొంది. రేపు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా అందులో మూడు చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. అవే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', 'శాకిని డాకిని'. ఈ చిత్రాల ఫలితం ప్రధాన తారాగణానికి కీలకం.

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. విభిన్న చిత్రాలు, పాత్రలతో ఆకట్టుకుంటున్న సుధీర్ ఓ భారీ కమర్షియల్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ సినిమా ఆ లోటుని భర్తీ చేస్తుందేమో చూడాలి. ఇక 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి ఈ ఏడాది ఇప్పటికే 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం'తో వరుసగా రెండు ఘోర పరాజయాలను చూసింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పరాజయంపాలైతే హ్యాట్రిక్ ప్లాప్స్ తో ప్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడే అవకాశముంది. అందుకే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది సుధీర్ కంటే కూడా కృతికి చాలా కీలకం.

'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలతో ఆకట్టుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది 'సెబాస్టియన్', 'సమ్మతమే' చిత్రాలతో తడబడ్డాడు. ఈ క్రమంలో అతను నటించిన లేటెస్ట్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' రిజల్ట్ అతనికి కీలకం కానుంది. పైగా ఈ చిత్రంలో మొదటిసారి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇటీవల ఎందరో యువ హీరోలు విభిన్న చిత్రాలతో సత్తా చాటుతున్న క్రమంలో ఈ చిత్రం ఫలితం తేడా కొడితే కిరణ్ రేసులో వెనకపడే అవకాశముంది. ఈ సినిమాకి 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' ఫేమ్ శ్రీధర్ గాదె డైరెక్టర్ కావడం కిరణ్ కి కలిసొచ్చే అంశం. మరి కిరణ్ కి శ్రీధర్ మరో విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.

నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రధారులుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'శాకిని డాకిని'. 'జెంటిల్ మన్', 'నిన్ను కోరి' వంటి హిట్ సినిమాలతో హీరోయిన్ గా తెలుగులో జర్నీ స్టార్ట్ చేసిన నివేదా.. కొంతకాలంగా వెనుకబడిపోయింది. గతేడాది 'వకీల్ సాబ్'తో ఆకట్టుకున్నప్పటికీ ఈమధ్య కాలంలో ఆమెకు లీడ్ రోల్ పోషించిన సినిమాలు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో తెలుగులో ఆమె మళ్ళీ బిజీ హీరోయిన్ గా మారిపోవాలంటే 'శాకిని డాకిని' ఫలితం అనేది కీలకం. ఇక మరో హీరోయిన్ రెజీనాది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. కొంతకాలంగా తెలుగులో బాగా వెనకబడిపోయిన రెజీనా ఈ సినిమా సక్సెస్ అయితే వరుస అవకాశాలతో పుంజుకునే అవకాశముంది. మరి ఈ శుక్రవారం ఈ యువ హీరో హీరోయిన్లకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



