అఫీషియల్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్!
on Sep 15, 2022

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత వరుసగా మాస్ సినిమాలలో నటిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'రెడ్', 'ది వారియర్' చిత్రాలతో రెండు వరుస షాక్ లు తిన్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా మాస్ జపం చేస్తున్న రామ్ ఇప్పుడు మళ్ళీ రూట్ మారుస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని గౌతమ్ మీనన్ కన్ఫర్మ్ చేసి సర్ ప్రైజ్ చేశాడు.
'చెలి', 'ఘర్షణ', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', 'ఏ మాయ చేశావె' వంటి సినిమాలతో గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇప్పటికే వెంకటేష్, నాగ చైతన్య, నాని వంటి తెలుగు హీరోలు ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చేరబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ మీనన్ రివీల్ చేశాడు.
కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వెందు తనిందదు కాడు'(తెలుగు లో 'లైఫ్ అఫ్ ముత్తు'). ఈ చిత్రం తమిళ్ లో ఈరోజు విడుదల కాగా, తెలుగులో శనివారం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ రామ్ తో మూవీ చేయబోతున్నట్లు గౌతమ్ మీనన్ తెలిపాడు. రామ్ తో రీసెంట్ గా చర్చించానని, స్రవంతి మూవీస్ నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుందని ఆయన చెప్పాడు.
దర్శకుడిగా గౌతమ్ మీనన్ విభిన్న జోనర్స్ లో సినిమాలు చేసినప్పటికీ ఆయన తెరకెక్కించే లవ్ స్టోరీలకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రస్తుతం రామ్ ఏమో వరుస మాస్ సినిమాలు చేస్తున్నాడు. మరి వీరి కాంబినేషన్లో వచ్చే మూవీ ఏ జోనర్ లో ఉంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



