పరాజయాల పరంపరకు బ్రేక్ పడుతుందా?
on Aug 4, 2022
టాలీవుడ్ సరైన విజయాన్ని అందుకొని రెండు నెలలైంది. జూన్ 3న విడుదలైన 'మేజర్' సినిమానే టాలీవుడ్ చూసిన చివరి సూపర్ హిట్ ఫిల్మ్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి కానీ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలవలేదు. ముఖ్యంగా జులైలో కనీసం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో టాలీవుడ్ ఈ ఆగస్టు నెల పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నెలలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ముందుగా రేపు(ఆగస్టు 5న) 'బింబిసార', 'సీతా రామం' చిత్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఈ రెండు చిత్రాలపైనే ఉంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకుడు. మొదట్లో 'బింబిసార' గురించి పెద్దగా ఎవరికీ తెలియనప్పటికీ.. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకి రానంత బజ్ ఈ సినిమాకి వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ పై ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ 'బింబిసార' ప్రేక్షకులను మునుపటిలా థియేటర్స్ కి రప్పించే సినిమా అవుతుందేమో చూడాలి.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే క్యాప్షన్ వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది దర్శకుడిగా హను రాఘవపూడిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. మరి ఈ సినిమా యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి వచ్చేలా చేస్తుందేమో చూద్దాం.
ప్రస్తుతం యాక్షన్, విజువల్ గ్రాండియర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పరంగా చూస్తే ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన 'బింబిసార'కు కాస్త అడ్వాంటేజ్ కానుంది. అలాగే 'సీతారామం'(2 గంటల 43 నిమిషాలు)తో పోల్చితే నిడివి తక్కువ కావడం 'బింబిసార''(2 గంటల 26 నిమిషాలు)కు కలిసొచ్చే మరో అంశం. అయితే పేరుకి 'సీతారామం' లవ్ స్టోరీ అయినప్పటికీ, వార్ సన్నివేశాలు కూడా ఉంటాయని.. నిడివిని మరిపించేలా ఎమోషన్ తో కూడిన బ్యూటిఫుల్ జర్నీలా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలు రెండు నెలలుగా విజయం కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తాయేమో చూడాలి.
Also Read