'ది వారియర్'తో రామ్ రేంజ్ మారిపోతుందా!
on Jul 12, 2022

వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'దేవదాసు'(2006) సినిమాతో 17 ఏళ్ళ వయసులోనే టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. మొదటి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్.. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన 'జగడం'(2007)తో నటుడిగా మరో మెట్టు ఎక్కిన ఈ ఎనర్జిటిక్ హీరో.. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'రెడీ'(2008)తో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇలా చేసిన మూడు సినిమాలలో రెండు భారీ కమర్షియల్ హిట్స్ ని అందుకున్న రామ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 'జగడం' కమర్షియల్ ఫెయిల్యూర్ అయినప్పటికీ ఆ సినిమాకి కూడా ఎందరో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా మూడు సినిమాలతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ కి వరుస క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి.

బి.గోపాల్ దర్శకత్వం వహించిన 'మస్కా'(2009) తోనూ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసి మరో విజయాన్ని అందుకున్న రామ్.. ఆ తర్వాత వచ్చిన 'గణేష్'(2009), 'రామ రామ కృష్ణ కృష్ణ'(2010) సినిమాలతో నిరాశపరిచాడు. ఇక 2011 లో వచ్చిన 'కందిరీగ'లో తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాలుగేళ్ళ పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. 'నేను శైలజ'(2016) తో ఎట్టకేలకు ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని హిట్ ట్రాక్ లోకి వచ్చిన రామ్.. ఆ వెంటనే మళ్ళీ ట్రాక్ తప్పాడు. ఆ తర్వాత రామ్ నటించిన మూడు సినిమాలూ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఒకవైపు రామ్ తర్వాత వచ్చిన నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు తనను దాటుకొని వెళ్తుంటే.. లుక్స్, ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, సూపర్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఇలా ఎన్నో పాజిటివ్ లు ఉన్న రామ్ మాత్రం వెనకపడిబోతున్నాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. అలాంటి టైంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్'(2019) తో లెక్కలన్నీ సరిచేశాడు రామ్. టైర్-2 హీరోలలో అసలుసిసలు మాస్ హీరో తానే అని ప్రూవ్ చేసుకున్నాడు. రామ్ డైలాగ్స్ కి, డ్యాన్స్ లకు, ఫైట్స్ కి మాస్ ఆడియెన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన కిక్ తో మాస్ జపం చేస్తున్నాడు రామ్. 'రెడ్'(2021) తోనూ మరో కమర్షియల్ హిట్ అందుకున్న రామ్.. ఇప్పుడు 'ది వారియర్' అనే మాస్ ఫిల్మ్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'పందెం కోడి' ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' రేంజ్ లో ఫైట్స్, డ్యాన్స్ లతో రామ్ అదరగొట్టబోతున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ.43 కోట్లు చేసిందనంటేనే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో తన రేంజ్ ఏంటో చూపించిన రామ్.. విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ప్రస్తుతం యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్న ప్రేక్షకులు 'ది వారియర్' రూపంలో రామ్ కి మరో బ్లాక్ బస్టర్ అందిస్తే.. రామ్ రేంజ్, మార్కెట్ పెరిగినట్లే. అప్పుడు రామ్ స్పీడ్ ని అందుకోవడానికి మిగతా కుర్రహీరోలు కష్టపడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



