కిరణ్ అబ్బవరం మరో వరుణ్ సందేశ్ అవుతాడా!
on Sep 16, 2022

'హ్యాపీ డేస్'(2007), 'కొత్త బంగారు లోకం'(2008) వంటి సూపర్ హిట్ సినిమాలతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్ సందేశ్. దీంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తలుపు తట్టిన ప్రతి సినిమాని చేసుకుంటూ పోయాడు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేశాడు. 2013లో ఏకంగా అతను నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏం లాభం?.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఇప్పుడు వరుణ్ మూవీ వస్తుందంటే కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. ఓ వైపు తనతో పాటు 'హ్యాపీ డేస్'లో నటించిన నిఖిల్ ఇటీవల 'కార్తికేయ-2'తో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరితే.. వరుణ్ మాత్రం పూర్తిగా వెనకబడిపోయాడు. కథల ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకోకుండా.. వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పోవడమే వరుణ్ డౌన్ ఫాల్ కి కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరంని చూస్తుంటే మరో వరుణ్ సందేశ్ అవుతాడా అనిపిస్తోంది.
'రాజా వారు రాణి గారు'(2019) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా బిగ్ కమర్షియల్ సక్సెస్ కాకపోయినా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక 2021లో వచ్చిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే వచ్చిన సినిమాలు వచ్చినట్టు చేస్తూ వరుణ్ సందేశ్ లా అయిపోతాడేమో అనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 'సెబాస్టియన్', 'సమ్మతమే' సినిమాలను విడుదల చేసి ఆకట్టుకోలేకపోయిన కిరణ్.. తాజాగా విడుదలైన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంతోనూ నిరాశపరిచాడు. ఓ వైపు పెద్ద పెద్ద స్టార్లే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు వాతలు పెడతారని భయపడుతుంటే.. కిరణ్ మాత్రం పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిరణ్ కథల ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకోకుండా, ఓ ప్లానింగ్ లేకుండా.. ఇలాగే వచ్చిన ప్రతి సినిమా వరుస పెట్టి చేసుకుంటూ పోతే కొంతకాలానికి కనుమరుగై పోయినా ఆశ్చర్యంలేదు. ప్రస్తుతం కిరణ్ చేతిలో మరో అరడజను దాకా సినిమాలున్నాయి. అవి కూడా కొద్ది నెలల్లో మనముందుకొస్తాయి. కానీ వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకునేవి ఎన్ని?.. ఇక నుంచైనా సినిమాల సంఖ్య గురించి కాకుండా కంటెంట్ గురించి ఆలోచిస్తే అడివి శేష్, నిఖిల్ వంటి హీరోల్లా నిలబడతాడు. లేదంటే హీరోగా తన సినీ ప్రయాణం మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



