'సీతారామం'కు రీమేక్ వస్తే.. దుల్కర్ రియాక్షన్ ఇదే!
on Sep 17, 2022
మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్, మరాఠీ నటి మృణాల్ ఠాకూర్‌ను ప్రేమికులుగా చూపిస్తూ హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన 'సీతారామం' మూవీ అందమైన ప్రేమకావ్యంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజయ్యాక.. దేశవ్యాప్తంగా అనేకమంది ఈ సినిమాని చూసి, క్లాసిక్ మూవీగా దానిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొంతమందైతే, ఆ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, దానిపై తమ అభిమానాన్ని ప్రకటిస్తున్నారు.
హిందీలో ఈ మూవీని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సినిమా యూనిట్ ఓ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అప్పుడు "సీతారామంకు రీమేక్ వచ్చే ఛాన్సుందా? వస్తే అందులో ఎవర్ని చూడాలనుకుంటున్నారు?" అనే ప్రశ్న దుల్కర్ సల్మాన్‌కు ఎదురైంది.
“ఒక చక్కని సినిమా ఆడియెన్స్‌కు తప్పకుండా నచ్చుతుందని ఒక నటుడిగా నాకు తెలుసు. 'సీతారామం' అనేది ఒక ఎపిక్. ఇది ఓ క్లాసిక్ అవుతుందని మేం ముందే అనుకున్నాం. మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా, లేదా? అనేది మాకు తెలియదు. ఈ సినిమా కోసం మేమెంతో కష్టపడ్డాం. ఈ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇది మళ్లీ మళ్లీ తీసే సినిమా అని నేను అనుకోవడం లేదు” అని అభిప్రాయపడ్డాడు దుల్కర్ సల్మాన్.
1960నాటి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక మందన్నా ఒక స్పెషల్ రోల్లో అలరించగా, తరుణ్ భాస్కర్, సుమంత్ అక్కినేని, గౌతమ్ మీనన్, జిషు సేన్‌గుప్తా, ప్రకాష్ రాజ్, భూమిక చావ్లా కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ఎస్సెట్స్ అయ్యాయి.