చిరు, బాలయ్య పాన్ ఇండియా వైపు చూడటం లేదు ఎందుకని!
on Dec 25, 2022

నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగులో తప్పితే మిగిలిన భాషలపై ఎప్పుడు ఆశలు పెట్టుకోలేదు. ఆయన పెద్దగా కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇంకా ఆయన చేసిన రీమేక్ చిత్రాలు కూడా చాలా తక్కువ. వాటిలో మనకి ప్రధానంగా కనిపించేది లక్ష్మీనరసింహ మాత్రమే. ఇక చిరంజీవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు మూడు చిత్రాల్లో నటించాడు. రాజశేఖర్ అంకుశం చిత్రాన్ని ప్రతి బంద్ గా, గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఆజ్ కా గూండారాజ్, అర్జున్-శంకర్‌ల జెంటిల్‌మేన్ చిత్రాన్ని ది జెంటిల్మెన్ గా రీమేక్‌లు చేసి పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మరల తిరిగి వచ్చాడు.
ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా చిత్రాలపై కన్నేశారు. కానీ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ పాన్ ఇండియా వైపు చూడటం లేదు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి వారిది కూడా అదే పరిస్థితి. నాగార్జున ఖుదాగవా, శివ, అంతం వంటి హిందీ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించాడు. ఎవరైనా అడిగితే చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ఇక వెంకటేష్ చంటికి రీమేక్‌గా అనారి, యమలీలకు రీమేక్ గా తక్దీర్ వాలా చిత్రాలలో నటించి మరలా అటు వైపు చూడలేదు. చిరంజీవి దింపుడు కళ్ళెం ఆశగా ఇటీవల తాను నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డిని దేశవ్యాప్తంగా విడుదల చేసినా పెద్దగా ఫలితం రాలేదు. దాంతో ఆయన కూడా ఇకపై కేవలం తెలుగు మార్కెట్ పైనే దృష్టి సారిస్తున్నాడు.
విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 12, 13 తేదీలలో వెంట వెంటనే విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు చిత్రాల మధ్య ఎవరు కాదన్నా భారీ పోటీ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద నువ్వా నేనా అన్న రేంజిలో పోటీ పడటం ఖాయం. ఈ రెండు చిత్రాలతో పాటు విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ లో జనవరి 13న కుత్తే, లకడ్ బగ్గా చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ తెలుగునాట ఇవేమీ చిరు, బాలయ్యలకు పోటీ కాదు. వాళ్ల టార్గెట్ కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే. అయితే ఇక్కడ మాత్రమే కాకుండా వీరికి తమిళనాడు, కర్ణాటకలలో కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. కేవలం వీరిని మాత్రమే చిరు, బాలయ్యలు టార్గెట్ చేస్తున్నారు. కంటెంట్ పరంగా ఈ రెండు పూర్తిగా కమర్షియల్ చిత్రాలు. తెలుగు ప్రేక్షకులను నేటివిటీని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చేసిన చిత్రాలు. పాన్ ఇండియా కంటెంట్ అయితే మేకర్స్ ఆ రకమైన ప్రయత్నాలు అయినా చేసేవారేమోగానీ ప్రస్తుతం ఆ తరహా ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి బాలయ్య, చిరులు తెలుగు మార్కెట్ పై ఎంతటి ప్రభావం చూపిస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారనేది... మనకి సంక్రాంతి నాటికి తేలిపోతుంది....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



