పదోసారి బరిలో చిరు, బాలయ్య... గెలుపు ఎవరిదో?
on Dec 21, 2022

సంక్రాంతి సీజన్లో ఏ సినిమా అయినా సరే హిట్ టాక్ సొంతం చేసుకుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వస్తాయి. మిగిలిన రోజుల్లో కంటే సంక్రాంతికి నాలుగైదు సినిమాలను కూడా సక్సెస్ చేయగలిగిన సత్తా ఉంది. అందుకే మన అగ్ర హీరోలు ఎక్కువగా సంక్రాంతి సీజన్ పై కన్నేస్తారు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉంటాయి. ఇక విషయానికి వస్తే ఈసారి సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా, నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి గా పోటీ పడుతూ వస్తున్నారు.. ఇప్పటివరకు చిరు, బాలయ్యలు సంక్రాంతి సీజన్లో తొమ్మిది సార్లు పోటీపడ్డారు.
అంటే ఇది పదో సారి. ఇక ఈ తొమ్మిది సార్ల విషయానికి వస్తే వారు మొదటిసారిగా 1985లో సంక్రాంతికి పోటీపడ్డారు. బాలకృష్ణ ఆత్మబలం అనే సినిమాతో వస్తే చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో వచ్చాడు. ఈ రెండింటిలో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ మొగుడు అనే సినిమాతో రాగా బాలకృష్ణ భార్గవ రాముడు అనే సినిమాతో వచ్చాడు. ఇందులో కూడా మరలా చిరంజీవిదే పై చేయి అయింది. 1988లో మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ అనే సినిమాతో వచ్చాడు.... అప్పుడు బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ తో పోటీపడ్డాడు. ఈ రెండిట్లో మరోసారి చిరంజీవి మంచి దొంగ పై చేయి సాధించింది. 1997లో చిరంజీవి హిట్లర్ సినిమాతో బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో వచ్చారు ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. 1999లో చిరంజీవి స్నేహం కోసం తో రాగా బాలకృష్ణ సమరసింహారెడ్డి గా ప్రభంజనం సృష్టించాడు.
2000ల సంవత్సరంలో బాలకృష్ణ వంశోద్ధారకుడుగా వస్తే చిరంజీవి అన్నయ్యగా వచ్చాడు. ఈసారి చిరంజీవి బాక్సాఫీస్ వద్ద బాలయ్యను డామినేట్ చేశాడు. 2001వ సంవత్సరాన్ని బాలయ్య ఎన్నటికీ మర్చిపోలేడు. ఆ ఏడాది బాలకృష్ణ నరసింహనాయుడుగా వస్తే చిరంజీవి మృగరాజుగా వచ్చాడు. మృగరాజు డిజాస్టర్ కాగా నరసింహనాయుడు తెలుగు సినీ చరిత్ర పాత రికార్డులను తిరగరాసింది. 2004లో బాలయ్య లక్ష్మీనరసింహాతో సక్సెస్ అందుకోగా చిరంజీవి మరోసారి అంజి తో డిజాస్టర్ అందుకున్నాడు. 2017లో చిరు ఖైదీ నెంబర్ 150 తో రాగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణితో వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.
ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి ఫెస్టివల్ లో నాలుగు సార్లు పై చేయి సాధించాడు... బాలయ్య మూడుసార్లు మెగాస్టార్ ను డామినేట్ చేశాడు. రెండుసార్లు మాత్రం ఇద్దరూ సమానంగా విజయాన్ని సాధించారు. మరలా ఇప్పుడు ఇంత కాలానికి మరోసారి చిరంజీవి బాలకృష్ణ లు సంక్రాంతి బరిలో నిలిచారు. మరి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డిలలో పదవసారి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



