లేడీ పవన్ కళ్యాణ్.. సాయి పల్లవి రూటే సెపరేటు
on Jun 13, 2022

సాయి పల్లవిని లేడీ పవన్ కళ్యాణ్ అంటూ ఓ సినిమా వేడుకలో డైరెక్టర్ సుకుమార్ అన్నాడు. ఆయన అన్న మాట అక్షర సత్యం. లేడీ పవన్ కళ్యాణ్ అనే పోలిక సాయి పల్లవికి సరిగ్గా సరిపోతుంది. స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ కనిపిస్తేనో, ఆయన పేరు వినిపిస్తేనో ఆడియన్స్ ఏ రేంజ్ లో గోల చేస్తారో.. సాయి పల్లవికి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఆమె మైక్ పట్టుకున్నా లేక ఆమె పేరు ఎవరైనా మైక్ లో చెప్పినా చాలు.. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా సాయి పల్లవి నామ జపంతో హోరెత్తిపోతోంది. ఇటీవల 'విరాట పర్వం' సినిమా వేడుకలో ఆమె క్రేజ్ చూసి రానా సైతం ఆశ్చర్యపోయాడు. అసలు సాయి పల్లవికి ఎంతకింత క్రేజ్? ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మాములుగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ, గ్లామర్ షో చేస్తూ స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్స్ ని మనం చూస్తుంటాం. కానీ సాయి పల్లవి రూటే సెపరేటు. స్టార్ హీరోల సినిమాలలో నటించింది లేదు. ఇక గ్లామర్ షో అనే మాటకు అయితే ఆమడ దూరం. అయినప్పటికీ ఈ జెనరేషన్ లో మరే హీరోయిన్ కి దక్కని క్రేజ్ ఆమె సొంతం. ఈ గ్లామర్ ప్రపంచంలోనూ తాను కొన్ని విలువలు పాటిస్తూ తన మనస్సుకి నచ్చింది చేస్తుండటమే.. మిగతా వారిలో సాయి పల్లవిని విభిన్నంగా నిలబెడుతోంది. ఆమె సై అంటే స్టార్ హీరోల సినిమాలలోనూ అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆమె అలా అనే రకం కాదు. సినిమా కథకి, అందులో ఆమె పాత్రకి విలువ ఉంటేనే ఆమె సినిమా చేయడానికి అంగీకరిస్తుంది. అంతేగాని స్టార్ హీరో సినిమాకైతే నాలుగు రాళ్లు ఎక్కువస్తాయన్న ఆశతో ఆమె సినిమా ఒప్పుకోదు. అలాగే డబ్బుల కోసం ప్రేక్షకులను మాయ చేసే ప్రకటనలలో నటించడానికి కూడా ఆమె వ్యతిరేకమే.

ఇలా ఒకటేమిటి? ఆమె పాటించే విలువలు ఎన్నో ఉన్నాయి. ఆమె ఎప్పుడూ మంచి సినిమాలోనే నటించాలనుకుంటుంది. తన సినిమా ద్వారానో, తన పాత్ర ద్వారానో ఒక మంచి విషయాన్ని చెప్పాలని ఆరాట పడుతుంటుంది. ఆన్ స్క్రీన్ లోనూ, ఆఫ్ స్క్రీన్ లోనూ ఆమె ప్రవర్తన, ఆమె వస్త్రధారణ ఆదర్శంగా ఉంటాయి. గరికపాటి నరసింహారావు లాంటి వారే సాయి పల్లవిని మెచ్చుకున్నారంటే.. ఆమె తీరు ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి పల్లవి సినిమా అంటే కుటుంబమంతా కలిసి చూడొచ్చు అనే అభిప్రాయముంది. ఆమె సినిమాలలో అసభ్యకర సన్నివేశాలు గానీ, ఇబ్బందికర సన్నివేశాలు గానీ ఉండవు. తమ ఇంటి ఆడపిల్లలా అన్ని వయస్సుల వారికి, అన్ని వర్గాల వారికి సాయి పల్లవి దగ్గరైంది.

మాములుగా హీరోయిన్స్ పై గాసిప్స్, నెగటివ్ కామెంట్స్ కామన్. కానీ సాయి పల్లవి విషయంలో అలా కాదు. ఆమె గురించి పెద్దగా నెగటివ్ మాటలే వినిపించవు. దానికి కారణం ఆమె పాటిస్తున్న విలువలే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆమెని ఓ కుటుంబసభ్యురాలిగా భావిస్తున్నారు. అందుకే ఆమె గురించి బ్యాడ్ కామెంట్స్ వినిపించవు. సినిమాలలోనే కాకుండా బయట కూడా ఆమె పాటిస్తున్న విలువలు, ఆమె మంచితనం.. ఆమెకు ఇంత క్రేజ్ ని తీసుకొచ్చాయి. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ అందరికీ ఇంత దగ్గరవ్వడం నిజంగా గొప్ప విషయం. హ్యాట్సాఫ్ సాయి పల్లవి.
-గంగసాని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



