సంచలన చిత్రం `జయం`కి 20 ఏళ్ళు!
on Jun 13, 2022

తెలుగునాట చరిత్ర సృష్టించిన ప్రేమకథా చిత్రాల్లో `జయం` (2002)కి ప్రత్యేక స్థానం ఉంది. నితిన్, సదాని నాయకానాయికలుగా పరిచయం చేస్తూ సంచలన దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమాకి గోపీచంద్ విలనిజం ఓ ఎస్సెట్ గా నిలిచింది. తేజ రచనలో రూపొందిన ఈ చిత్రంలో శివ కృష్ణ, ప్రసాద్ బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుమన్ శెట్టి, లక్ష్మీపతి, షకీలా, సుప్రీత్, రాళ్ళపల్లి, ఢిల్లీ రాజేశ్వరి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
కథ విషయానికి వస్తే.. రఘు (గోపీచంద్), సుజాత (సదా)కి చిన్నతనంలోనే వాళ్ళ పెద్దలు పెళ్ళి నిర్ణయిస్తారు. అయితే, రఘు - సుజాతకి ఒకరంటే ఒకరికి పడదు. కొన్ని కారణాల వల్ల రఘు కుటుంబం వేరే ఊరికి వెళుతుంది. ఇక యుక్త వయసుకి వచ్చిన సుజాతని వెంకట్ (నితిన్) ప్రేమిస్తాడు. సుజాత కూడా క్రమంగా వెంకట్ ని ఇష్టపడుతుంది. మరోవైపు.. రఘు, సుజాతకి పెళ్ళి నిశ్చయవుతుంది. ఈ నేపథ్యంలో.. దుర్మార్గుడైన రఘు బారి నుండి వెంకట్, సుజాత జంట ఎలా తప్పించుకుంది? వారి ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అనే అంశంతో `జయం` రూపొందింది.
ఆర్పీ పట్నాయక్ బాణీలు కట్టిన ఈ చిత్రానికి కులశేఖర్ సాహిత్యమందించారు. ``రాను రానంటూనే``, ``అందమైన మనసులో``, ``ప్రియతమా``, `` బండి బండి``, ``ఎవ్వరు ఏమన్నా``, ``వీరి వీరి గుమ్మడిపండు``.. ఇలా ఇందులోని పాటలన్నీ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఇక సదా నోటివెంట పదే పదే వచ్చే ``వెళ్ళవయ్యా వెళ్ళు`` అనే డైలాగ్ అయితే అప్పట్లో భలేగా ప్రాచుర్యం పొందింది.
`ఉత్తమ ప్రతినాయకుడు` (గోపీచంద్), `ఉత్తమ హాస్యనటుడు` (సుమన్ శెట్టి), `ఉత్తమ బాల నటి` (శ్వేత), `ఉత్తమ అనువాద కళాకారిణి` (సునీత) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ నూతన నటుడు` (నితిన్), `ఉత్తమ నటి` (సదా) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను కైవసం చేసుకున్న `జయం`.. తమిళంలో `జయం` (`జయం` రవి, సదా, గోపీచంద్) పేరుతోనే రీమేక్ అయి అక్కడా ఘనవిజయం సాధించింది. `చిత్రం మూవీస్` పతాకంపై తేజనే స్వయంగా నిర్మించిన `జయం`.. 2002 జూన్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. కాగా, మంగళవారంతో ఈ సంచలన చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



